Begin typing your search above and press return to search.

తమిళ పార్టీల వికృత క్రీడకు ఆమె బలైంది

By:  Tupaki Desk   |   12 May 2016 1:37 PM GMT
తమిళ పార్టీల వికృత క్రీడకు ఆమె బలైంది
X
ఓ పక్క జయలలితను ఆకాశానికెత్తేస్తూ చేసిన యాడ్లో ఆమె నటించింది.. మరోపక్క జయలలిత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే ప్రకటనలోనూ ఆమే కనిపిస్తోంది. దీంతో తమిళ జనాలకు ఇదేం విడ్డూరమో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. తమిళనాడు రెండు ప్రధాన పార్టీలు ఆడిన వికృత క్రీడలో ఆ ముసలావిడ అల్లాడిపోతోంది. ఆయా పార్టీల కార్యకర్తలు ఇప్పుడు ఆమెను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇంతకీ ఎవరా నటి.. ఏమా కథ తెలుసుకుందాం పదండి.

ఆ నటి పేరు కస్తూరి. వయసు 64 ఏళ్లు. (64) . అందరూ ముద్దుగా కస్తూరి పాటి అంటారు. పాటి అంటే అవ్వ అని అర్థం. ధనుష్ సినిమా ‘మయక్కం ఎన్న’, విజయ్ సేతుపతి సినిమా ‘ఇదకుదానే ఆశపట్టె బాలాకుమారా’ లాంటి సినిమాల్లో నటించి పాపులర్ అయిన ఈమెను ముందు జయలలితకు చెందిన ‘అన్నాడీఎంకే’ పార్టీ కార్యకర్తలు కలిశారు. ఓ యాడ్లో నటించడం కోసం తీసుకెళ్లారు. ఆమె మీద యాడ్ తీసి రూ.1500 చేతిలో పెట్టారు. ‘‘కన్నబిడ్డలే కూడు పెట్టలేదు, నాకు అన్నం పెట్టింది విప్లవనాయిక అమ్మే’’ అంటూ ఆ యాడ్లో డైలాగ్ చెబుతుంది కస్తూరి. జయలలిత చేపట్టిన ‘అమ్మ క్యాంటీన్’ పథకాన్ని ప్రచారం చేయడానికి కస్తూరిని ఇలా వాడుకున్నారు.

ఇక్కడితే కథ ముగిస్తే పోయేది. కానీ కొన్ని రోజుల తర్వాత కరుణానిధి ‘డీఎంకే’ పార్టీ కార్యకర్తలు వచ్చారు. ఆమెను తీసుకెళ్లి ఓ యాడ్ చేయించారు. అది అమ్మకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. ‘‘ఆకాశంలో ఎగిరేవారికి మన సమస్యలు ఎలా తెలుస్తాయి? ప్రజల గురించి పట్టించుకోని ప్రభుత్వం ఇంకెందుకండి, చాలమ్మా..’’ అంటూ డైలాగ్ కొడుతుంది కస్తూరి ఇందులో. ఈ యాడ్ ఎందుకని కూడా తనకు తెలియదని.. ఆ తర్వాత అమ్మకు వ్యతిరేకంగా చేసిందని తెలిసి దాన్ని వ్యతిరేకించానని.. కానీ తన మాట వినకుండా ఆ యాడ్ ను టీవీల్లో వేసేశారని అంటోంది కస్తూరి. ఈ యాడ్ కోసం ఆమెకు వెయ్యి రూపాయిలే ఇచ్చారట. ఓపక్క డీఎంకే యాడ్.. ఇంకో పక్క అన్నాడీఎంకే యాడ్.. రెండింట్లోనూ ఒకే నటి. మొత్తానికి తమిళ జనాలకు ఈ యాడ్స్ బాగానే వినోదాన్నిస్తున్నాయి. రెండు యాడ్లనూ కలిపి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తూ వినోదం చూస్తున్నారు జనాలు. ఐతే అమ్మకు అనుకూలంగా యాడ్ చేసి.. తర్వాత ఆమెకు వ్యతిరేకంగా తెరకెక్కిన యాడ్ లో నటించడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు కస్తూరిని టార్గెట్ చేస్తున్నారు. ఈ యాడ్స్ వల్ల తనకు దక్కింది కేవలం 2500 రూపాయలు. కానీ దీని వల్ల చాలా ఇబ్బంది ఎదురవుతుండటంతో నన్ను వదిలేయండి బాబూ అంటూ చేతులెత్తి మొక్కుతోంది కస్తూరి పాటి.