Begin typing your search above and press return to search.

సిట్టింగ్ ఎమ్మెల్యే సూసైడ్ వార్నింగ్?

By:  Tupaki Desk   |   20 Sep 2015 9:18 AM GMT
సిట్టింగ్ ఎమ్మెల్యే సూసైడ్ వార్నింగ్?
X
ఎన్నికల ప్రక్రియ మొదలైందంటే చాలు పార్టీ అధినేతలకు ఉండే తలనొప్పులు అన్నిఇన్ని కావు. వివిధ వర్గాల నుంచి.. వివిధ మార్గాల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తుంటాయి. వాటికి తలొగ్గుతూనే.. ప్రజల్లో పట్టు పట్టును కోల్పోకుండా ఉండటం.. అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవటం అంత చిన్న విషయమేమీ కాదు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. సీట్ల కేటాయింపు పూర్తి అయ్యేసరికి తలప్రాణం తోకకు వస్తుంది. సీట్ల కేటాయింపులో ఏ చిన్న తేడా దొర్లినా.. అసంతృప్తుల్ని వదిలేసినా. వారు చేసే రచ్చతో.. మొదటికే మోసం వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి పరిస్థితులు తాజాగా బీహార్ ఎన్నికల్లోనూ కనిపిస్తున్నాయి. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఇచ్చిన వార్నింగ్ అక్కడి ఆర్జేడీ అధినేతను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

పార్టీ తరఫున తనకు పోటీ చేయటానికి అవకాశం ఇవ్వాలని.. లేనిపక్షంలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతానని చెప్పటమే కాదు.. గడువు ఇచ్చి మరీ భయపెట్టేస్తున్నాడు. బీహార్ లోని భోజ్ పూర్ జిల్లా జగదీశ్ పూర్ అసెంబ్లీ ఎమ్మెల్యే బాయి దినేష్ అర్జేడీ అధినేతకు తలనొప్పిగా మారాడు. 2014లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఆయన.. తాజా ఎన్నికల్లోనూ పార్టీ టిక్కెట్టు కోరుతున్నాడు.

సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ.. ప్రజల్లోనూ ఆదరణ ఉన్నప్పటికీ తనకు టిక్కెట్టు ఎలా ఇవ్వరని ఆయన వాపోతున్నాడు. అన్నింటికి మించి.. గత ఎన్నికల్లో ఆయన చేతిలో ఓడిపోయిన భగవాన్ సింగ్ కుష్వాహాకు లాలూ ప్రసాద్ యాదవ్ టిక్కెట్టు ఇవ్వనున్న సమాచారం మీడియాలోకి రావటంతో ఆయన అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నాడు. తన చేతిలో ఓడిపోయిన వ్యక్తికి.. పార్టీలో చేర్చుకొని మరీ టిక్కెట్టు ఇవ్వటమేమిటని మండిపడుతున్న బాయి దినేష్ చివరకు ఆత్మహత్య హెచ్చరిక చేస్తున్నాడు. తనకు కానీ టిక్కెట్టు ఇవ్వకుండా తాను పార్టీ కార్యాలయంలోనే సూసైడ్ చేసుకుంటానని హెచ్చరిస్తున్నాడు. ఈ వ్యవహారంలో లాలూ ఏం చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంట రేకెత్తిస్తోంది.