Begin typing your search above and press return to search.

లాలూ పార్టీ ఎమ్మెల్యే కొడుకు అరాచకం..

By:  Tupaki Desk   |   17 Sep 2016 10:51 AM GMT
లాలూ పార్టీ ఎమ్మెల్యే కొడుకు అరాచకం..
X
వరుస వివాదాలతో వార్తల్లోకి వస్తున్న లాలూప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడీ పార్టీ తీరును వేలెత్తి చూపించే ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో బీహార్ లోని ఆర్జేడీ పై పలు ఆరోపణలు వస్తున్నాయి. నేరమయ నేతలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారని చెప్పే ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యే తనయుడు దారునానికి పాల్పడ్డాడు. తన కారును ఓవర్ టేక్ చేశారన్న ఆగ్రహంతో.. సదరు బైకిస్ట్ ను దారుణంగా పొడిచేసిన ఘటన చోటు చేసుకుంది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

ఔరంగాబాద్ లోని ఓబ్రా ప్రాంతంలో ఆర్జేడీ ఎమ్మెల్యే బీరేంద్ర సిన్హా కుమారుడు కునాల్ ప్రతాప్ కారులో వెళుతున్నాడు. అతడు వెళుతున్న కారును బైక్ మీద వెళుతున్న ఒక యువకుడు ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. దీంతో.ఆగ్రహం చెందిన అతగాడు.. మరోసారి వేగంగా కారును పోనిచ్చిఆ యువకుడ్ని క్రాస్ చేశాడు. అనంతరం బైక్ ను ఆపిన ఎమ్మెల్యే సుపుత్రుడు.. బైక్ డ్రైవ్ చేస్తున్న యువకుడిని విచక్షణారహితంగా కత్తితో పొడిచినట్లుగా ఆరోపనలు వ్యక్తమవుతున్నాయి.

కత్తిపోట్లకు గురైన యువకుడి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.అతగాడిని ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ కేసులో ఎమ్మెల్యే కుమారుడు కునాల్ ప్రతాప్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ ఉదంతంపై ఎమ్మెల్యే బిరేంద్ర రియాక్ట్ అయ్యారు. తనను రాజకీయంగా దెబ్బ తీసేందుకే ఇలాంటివి సృష్టిస్తున్నరన్నారు. ఈ ఘటనలో తన కొడుక్కి ఏ మాత్రం సంబంధం లేదని.. సదరు యువకుడే తనను తాను కత్తితో పొడుచుకున్నట్లుగా చెప్పారు.

తన కొడుకును పోలీసులు అరెస్ట్ చేయలేదని.. కేవలం వివరాలు అడిగి తెలుసుకునేందుకు మాత్రమే పిలిచినట్లుగా చెప్పుకొచ్చాడు. తన కుమారుడు అమాయకుడని.. ఆ విషయంలో తనకు నమ్మకం ఉందన్న ఎమ్మెల్యే బీరేంద్ర.. నిజానిజాలుత్వరలోనే బయటకు వస్తాయన్నారు. ఏ ఎమ్మెల్యే మాత్రం తన కొడుకు చేసిన ఎదవ పనిని ఒప్పుకొని.. అతడ్ని చట్టబద్ధంగా శిక్షకు గురి చేసే దాఖలాలు స్వతంత్ర భారతంలో ఉన్నాయా..? అయినా.. ఏ యువకుడికి మాత్రం తనను తాను కత్తితో తీవ్రంగా పొడుచుకొని ప్రాణాల కోసం పోరాటం చేస్తుంటారు..?