Begin typing your search above and press return to search.

ఆర్జేడీ మేనిఫెస్టో: లాలూ వస్తే నితీష్ కు ఫేర్ వెల్ యేనా?

By:  Tupaki Desk   |   24 Oct 2020 6:00 PM IST
ఆర్జేడీ మేనిఫెస్టో: లాలూ వస్తే నితీష్ కు ఫేర్ వెల్ యేనా?
X
బలమైన అధికార, ప్రతిపక్షాల నడుమ బిహార్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తొలి విడత పోలింగ్ కు సమయం దగ్గరపడుతుండడంతో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కుతోంది.

బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ పై ప్రతిపక్ష నేత, ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ విమర్శల వర్షం కురిపించారు. నితీష్ హయాంలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోయిందని.. పేదరికం తాండవిస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా తన తండ్రి, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసిందని.. నవంబర్ 9న జైలు నుంచి బయటకు వస్తున్నారని తేజస్వి ప్రకటించారు.

తన తండ్రి లాలూప్రసాద్ బయటకు వచ్చిన వెంటనే నితీష్ పదవి నుంచి దిగిపోక తప్పదని తేజస్వి యాదవ్ జోస్యం చెప్పారు. సీఎంకు ఇక ఫేర్ వల్ ఇచ్చే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

బీహార్ ఎన్నికల తొలివిడత పోలింగ్ కు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉన్న వేళ తేజస్వి మరింత దూకుడు పెంచారు. ఎన్నికల్లో కీలకమైన మేనిఫెస్టోని విడుదల చేశారు. మొత్తం 17 అంశాలతో కూడిన మేనిఫెస్టోని విడుదల చేశారు. యువత, నిరుద్యోగులను ఆకర్షించే విధంగా అందులో పొందుపరిచారు. ఆరోగ్య బీమా, విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు.

ఇక బీహార్ ఎన్నికల్లో మరోసారి విజయం జేడీయూ-ఎన్డీఏ కూటమిదేనని చాలా సర్వేల్లో తేలింది. ఇప్పటికీ నితీష్ పాలనకే బీహారీలు జై కొడుతున్నారు. బీజేపీ సమర్థపాలన కూడా కలిసి వస్తుందని సర్వేలు తేల్చాయి.