Begin typing your search above and press return to search.

మూతి పగలకొడతానంటూ ఆర్కే రోజా వార్నింగ్

By:  Tupaki Desk   |   7 Feb 2022 5:32 AM GMT
మూతి పగలకొడతానంటూ ఆర్కే రోజా వార్నింగ్
X
ఫైర్ బ్రాండ్ అన్న మాటకు ప్రతిరూపంగా కనిపిస్తుంటారు నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. తన అభిమాన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలన్న ఆశను.. ఆకాంక్షను బలంగా ప్రదర్శించటమే కాదు.. అందుకు తగ్గట్లే శ్రమించిన అతికొద్ది వైసీపీ నేతల్లో ఆమె ఒకరు. జగన్ ముఖ్యమంత్రి అయితే.. ఆర్కే రోజాకు మంత్రి పదవి అన్న మాట బలంగా వినిపించేది. అందుకు భిన్నంగా ఆమెకు మొండిచేయి చూపటం.. సమీకరణాల బూచిని చూపించి పదవి ఇవ్వకపోవటం తెలిసిందే. ఇచ్చిన పదవి కారణంగా ప్రయోజనం శూన్యంగా మారటం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో సొంత పార్టీకి చెందిన ప్రత్యర్థుల కారణంగా ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విపక్ష నేత చంద్రబాబును కానీ ఆయన రాజకీయ వారసుడిగా పేరున్న నారా లోకేశ్ ను నోటికి వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసే ఆర్కే రోజా..తన ఇలాకాలోని సొంత పార్టీకి చెందిన నేతల విషయంలో మాత్రం తరచూ ఇబ్బందులకు గురవుతున్నారు.

అంతేకాదు.. తాను ఎవరినైతే వ్యతిరేకిస్తున్నారో.. వారికే సీఎం జగన్మోహన్ రెడ్డి నామినేటెడ్ పదవులు ఇవ్వటంతో రోజా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో విసుగు చెందిన ఆమె.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించటం.. ఆ తర్వాత ఆమె వెనక్కి తగ్గడం జరిగింది. ఇదిలా ఉంటే.. తాజాగా నగరి నియోజకవర్గంలోని టీడీపీ నేత గాలి భాను ప్రకాశ్ (మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడి తనయుడు) అధికార పక్ష ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ఘాటు ఆరోపణలు చేశారు.

ఇసుక.. మట్టి.. గ్రావెల్ అక్రమ దందాలో రోజాకు భాగం ఉందని గాలి భానుప్రకాశ్ ఆరోపించారు. దీనిపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికి వచ్చినట్లు వాగితే మూతి పగలగొడతానని వార్నింగ్ ఇచ్చిన ఆమె.. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. రోజా మండిపాటుపై గాలి భానుప్రకాశ్ స్పందిస్తున్నారు. తన తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడి అక్రమ మట్టి రవాణాను అడ్డుకున్నారని.. ఎమ్మెల్యే రోజా మాత్రం మట్టి తరలింపునకు అండగా నిలుస్తున్నారని భాను ప్రకాశ్ మండిపడుతున్నారు.

ఇదిలాఉంటే.. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన ఆర్కే రోజా.. కావాలంటే తన బ్యాంక్ బ్యాలెన్సులు చూపిస్తానని.. తాను ప్రజల పక్షాన నిలిచే నేతగా ఆమెను ఆమె అభివర్ణించుకుంటున్నారు. తమ పార్టీకి చెందిన కొందరి సహకారంతో తనను ఓడించాలని భావిస్తున్నారని.. అది మాత్రం పగటి కలగానే మిగిలిపోతుందన్న ధీమాను వ్యక్తం చేయటం గమనార్హం. ఓవైపు సొంత పార్టీకి చెందిన అసమ్మతి నేతలతో.. మరోవైపు విపక్ష పార్టీకి చెందిన రాజకీయ ప్రత్యర్థితో పోరాడుతున్న ఆర్కే రోజా ఇబ్బందికర పరిస్థితుల్లో పోరాటం చేస్తున్నారనే చెప్పాలి. ఏమైనా.. ఆమెకు ఎదురవుతున్న సవాళ్లను ఆమె ఎంతలా ఎదుర్కొంటుందన్న దాని ఆధారంగానే ఆమె ఎంత ఫైర్ బ్రాండ్ అన్నది స్పష్టమవుతుందని చెప్పక తప్పదు.