Begin typing your search above and press return to search.

పోలీసుల మీద వేసిన నింద మాటేంటి?

By:  Tupaki Desk   |   5 Nov 2016 5:05 AM GMT
పోలీసుల మీద వేసిన నింద మాటేంటి?
X
తప్పు చేయకుండానే తప్పు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కోవటానికి మించిన ఇబ్బంది మరొకటి ఉండదు. వ్యక్తిగా ఇదెంత ఇబ్బందో.. వ్యవస్థగా అంతే ఇబ్బంది. సందేహం రాగానే.. వెనుకా ముందు చూసుకోకుండా ఆరోపణలు చేయటమే కాదు.. తమ దగ్గర పక్కా సాక్ష్యాలు ఉన్నట్లుగా చెప్పి.. ఆ తర్వాత చేతులెత్తేసే వారి విషయంలో ఏం చేయాలన్న అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే (రామకృష్ణ) పోలీసుల కాల్పుల్లో గాయపడి.. వారి నిర్బందంలో ఉన్నట్లుగా ఆయన సతీమణి శిరీష హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన భర్తను కోర్టు ఎదుట హాజరు పరిచేలా పోలీసుల్ని ఆదేశించాలని కోరుతూ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటీషన్ ను ఉప సంహరించాలని కోరుతూ శిరీష తాజాగా హైకోర్టును కోరింది.

ఆంధ్రా.. ఒడిశా సరిహద్దుల్లో ఎన్ కౌంటర్ జరగటం.. ఇందులో భారీ ఎత్తున మావోలు మృత్యువాతబడటం తెలిసిందే. ఈ ఘటనలో మావోల ఆగ్రనేత ఆర్కే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా శిరీష ఆరోపణించారు. పోలీసుల అధీనంలో ఉన్న తన భర్తను కోర్టు ఎదుట హాజరుపర్చాలని కోరుతూ ఆర్కే సతీమణి హైకోర్టును ఆశ్రయించటం.. అందుకు తగ్గ ఆధారాలు ఏమున్నాయన్న ప్రశ్నకు.. తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నట్లుగా శిరీష తరఫు న్యాయవాది వాదించటం తెలిసిందే.

అయితే.. పౌరహక్కుల నేత వరవరరావు మీడియా ముందుకు వచ్చి ఆర్కే పోలీసుల అధీనంలో లేరని.. ఆయన సురక్షితంగా ఉన్నట్లుగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు దృష్టికి తాజా పరిస్థితిని విన్నవించిన శిరీష.. తన భర్త క్షేమంగా ఉన్నారని.. తాను వేసిన పిటీషన్ ను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. దీనిపై లిఖిత పూర్వకంగా కోర్టుకు ఇవ్వాలని కోరిన కోర్టు.. ఈ విషయంపై విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే.. హెబియస్ కార్పస్ పిటీషన్ వేసినప్పుడు.. తన భర్త పోలీసుల అధీనంలో ఉన్నట్లుగా తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నట్లు ప్రకటించిన ఆమె.. ఈ రోజు తన భర్త క్షేమంగా ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఈ రోజు మాటను ప్రామాణికంగా తీసుకున్నప్పుడు అంతకు ముందు పోలీసుల పని తీరును ఆక్షేపించేలా.. అనుమానించేలా ఆరోపణలు చేయటం తెలిసిందే. నిజానిజాల్ని సరిచూసుకోకుండా తొందరపడి ఒక వ్యవస్థను వేలెత్తి చూపించేలా చేసి.. డ్యామేజ్ చేయటాన్ని ఏమనాలి? అన్నది ప్రశ్న. పోలీసుల అధీనంలో తన భర్త ఉన్నట్లు తన దగ్గర పక్కా సాక్ష్యాలు ఉన్నాయని చెప్పిన మాటను ఈ రోజు వెనక్కి తీసుకోవటాన్ని ఎలా చూడాలన్నది ప్రశ్న? పోలీసుల తీరును ప్రశ్నించలా.. తప్పు పట్టేలా ఉన్న ఈ వ్యవహారంపై శిరీష చెప్పే సమాధానం ఏమిటన్నది ఒక ప్రశ్న అయితే.. ఇలాంటి ఉదంతాలపై కోర్టులు ఎలా రియాక్ట్ అవుతాయన్నది ఇప్పుడు మరో ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/