Begin typing your search above and press return to search.

రోడ్డు రోల‌ర్ దెబ్బ‌కు గులాబీ కారు క్రాష్!

By:  Tupaki Desk   |   24 May 2019 6:55 AM GMT
రోడ్డు రోల‌ర్ దెబ్బ‌కు గులాబీ కారు క్రాష్!
X
ఎన్నిక‌ల అప్ర‌మ‌త్త‌త ఎంతో అవ‌స‌రం. ఆత్మ‌విశ్వాసం ఉండాలే కానీ.. అదెక్క‌డా శృతిమించ‌కూడ‌దు. ఏ చిన్న పొర‌పాటు జ‌రిగినా మొత్తం ఫ‌లితం మీద‌నే ప్ర‌భావం చూపుతుంద‌న‌టానికి తాజా ఉదాహ‌ర‌ణ‌గా న‌ల్గొండ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గంలో చోటు చేసుకున్న ఉదంతం పెద్ద ఉదాహ‌ర‌ణ‌గా చెబుతున్నారు. న‌ల్గొండ ఎంపీ స్థానానికి జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి విజ‌యం సాధించ‌టం తెలిసిందే.

అయితే.. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాన్ని నిశితంగా ప‌రిశీలిస్తే.. ఆస‌క్తిక‌ర అంశం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. టీఆర్ఎస్ కారు గుర్తుకు ద‌గ్గ‌ర‌గా ఉన్న రోడ్డు రోల‌ర్ కు భారీగా ఓట్లు న‌మోదు కావ‌టంతో టీఆర్ఎస్ ఓట‌మికి కార‌ణ‌మైంద‌ని చెప్పాలి. ఇటీవ‌ల కాలంలో కారుకు ద‌గ్గ‌ర‌గా ఉంటే ప‌లుగుర్తుల‌ను గుర్తించిన టీఆర్ఎస్.. ఎన్నిక‌ల సంఘం దృష్టికి ఈ విష‌యాన్ని తీసుకెళ్లి.. తెలంగాణ‌లో ఆయా గుర్తుల్ని ఎవ‌రికి కేటాయించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

అయితే.. న‌ల్గొండలో ఇండిపెండెంట్ గా బ‌రిలోకి దిగిన ఒక అభ్య‌ర్థికి రోడ్డు రోల‌ర్ గుర్తును ఎన్నిక‌ల సంఘం కేటాయించిన వైనాన్ని గుర్తించ‌టంలో జ‌రిగిన పొర‌పాటున‌కు టీఆర్ఎస్ ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించ‌క త‌ప్ప‌లేదు. స్వ‌తంత్ర అభ్య‌ర్థికి కేటాయించిన ఈ గుర్తు గులాబీ కారును పోలిన రీతిలో ఉండ‌టంతో.. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ప‌లువురు నిర‌క్ష్య‌రాసులు రోడ్డు రోల‌ర్ గుర్తుకు ఓటు వేశారు. ఈ వాద‌న ఎంత నిజ‌మ‌న్న‌ది ఆ గుర్తుకు వ‌చ్చిన ఓట్ల‌ను చూస్తే అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి.

న‌ల్గొండ ఎంపీ స్థానంలో రోడ్డు రోల‌ర్ గుర్తుకు ఏకంగా 27,973 ఓట్లు న‌మోదు కావ‌టం గ‌మనార్హం. బ‌ల‌మైన వామ‌ప‌క్ష పార్టీ అభ్య‌ర్థికి వ‌చ్చిన ఓట్ల‌కు స‌మానంగా ప‌డిన ఈ ఓట్లు మొత్తం టీఆర్ ఎస్ కు ప‌డాల్సిన‌విగా అంచనా వేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. న‌ల్గొండ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన కోమ‌టిరెడ్డి త‌న స‌మీప టీఆర్ ఎస్ ఎంపీ అభ్య‌ర్థిపై 5219 ఓట్లు తేడాతో విజ‌యం సాధించారు.

ప్ర‌తి రౌండ్ లోనూ రోడ్డు రోల‌ర్ గుర్తుకు క‌నీసం రెండు వేల‌కు త‌గ్గ‌కుండా ఓట్లు పోల్ కావ‌టం గ‌మ‌నార్హం. ఈ అంకెల్ని చూస్తే.. రోడ్డు రోల‌ర్ నుకారుగా భావించిన ప‌లువురు ఓట‌ర్లు ఓట్లు వేయ‌టంతో.. గులాబీ ఓట్లు చీలి.. కాంగ్రెస్ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి విజ‌యానికి కార‌ణంగా మారింది. మొత్తానికి రోడ్డు రోల‌ర్‌.. గులాబీ కారును భారీగా దెబ్బేసిన‌ట్లు చెప్ప‌క త‌ప్ప‌దు. త‌న ఫెయిల్యూర్ నుంచి విజ‌యాన్నిసాధించేందుకు ఏమేం అవ‌స‌ర‌మ‌ని గుర్తించే కేసీఆర్‌.. తాజా ఎపిసోడ్ లో రోడ్డు రోల‌ర్ వ్య‌వ‌హారాన్ని ఆయ‌న ఈసీ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.