Begin typing your search above and press return to search.

రోడ్డురోల‌ర్ ను త‌ప్పు ప‌డ‌తారా?

By:  Tupaki Desk   |   26 May 2019 5:23 AM GMT
రోడ్డురోల‌ర్ ను త‌ప్పు ప‌డ‌తారా?
X
తాజాగా ముగిసిన లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు తెలంగాణ అధికార‌ప‌క్షానికి షాకింగ్ గా మార‌టం తెలిసిందే. కారు.. ప‌ద‌హారు అంటూ చేసిన ప్ర‌చారానికి దెబ్బ ప‌డ‌టమే కాదు.. సిట్టింగ్ స్థానాల్లో సైతం గెల‌వ‌లేక చ‌తికిల‌ప‌డిన ప‌రిస్థితి. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తాము ప‌ద‌హారు స్థానాల్లో గెలుస్తామ‌న్న ధీమాను వ్య‌క్తం చేసిన కేసీఆర్ మాట త‌ప్పైంది. ఆయ‌న అంచ‌నా ఫెయిల్ అయ్యింది.

ఇదిలా ఉంటే.. భువ‌న‌గిరి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి గెలుపొందారు. అయితే.. కారు గుర్తుకు ద‌గ్గ‌ర‌గా ఉన్న రోడ్డు రోల‌ర్ గుర్తుకు 27,973 ఓట్లు ప‌డ‌టంతో తాము ఓడిపోయిన‌ట్లుగా టీఆర్ ఎస్ పేర్కొంది. రోడ్డు రోల‌ర్ కారును డ్యామేజ్ చేసిన‌ట్లుగా టీఆర్ ఎస్ నేత‌లు వాపోయారు. గులాబీ నేత‌ల వ్యాఖ్య‌ల్ని రోడ్డురోల‌ర్ గుర్తు ఉన్న పార్టీ భార‌త క‌మ్యునిస్టు విప్ల‌వ‌కారుల స‌మైక్య‌తా కేంద్రం తీవ్రంగా ఖండిస్తోంది.

ప్ర‌జ‌లు కారుకు వేయ‌బోయి రోడ్డు రోల‌ర్ కు ఓటు వేశార‌న్న వాద‌న స‌రికాద‌ని.. ఇదంతా త‌ప్పుడు ప్ర‌చార‌మ‌ని కొట్టి పారేశారు. ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌టం విప్ల‌వ‌కారుల్ని.. క‌మ్యునిస్టుల‌ను అవ‌మానించ‌టమేన‌ని మండిప‌డుతున్నారు. త‌మ పార్టీకి వ‌రంగ‌ల్ లో 14వేల ఓట్లు వచ్చాయ‌న్న విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. చూస్తుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ రోడ్డు రోల‌ర్ బ‌రిలో ఉండే ప్ర‌య‌త్నాలు మొద‌లైన‌ట్లేన‌న్న మాట టీఆర్ ఎస్ నేత‌ల నోటి నుంచి వినిపిస్తోంది. మ‌రి.. దీనిపై గులాబీ బాస్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.