Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి.. నాడు రోడ్లు.. నేడు పైపులు!

By:  Tupaki Desk   |   8 Oct 2022 6:48 AM GMT
అమ‌రావ‌తి.. నాడు రోడ్లు.. నేడు పైపులు!
X
ఊరంద‌రిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టదొక దారి అన్న‌ట్టు అన్ని పార్టీలు అమ‌రావ‌తి ఏకైక రాజ‌ధానిగా ఉండాల‌ని కోరుకుంటుంటే జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం మూడు రాజ‌ధానులంటోంది. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అమ‌రావ‌తిలో ప్రారంభించిన ప‌థ‌కాలు, ప‌నులు, ప్రాజెక్టులు ఇప్ప‌టికి ఎక్క‌డి వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టు ఉన్నాయ‌ని తీవ్ర విమ‌ర్శ‌లు ఇప్ప‌టికే వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ విష‌యంలో స్వ‌యంగా ఏపీ హైకోర్టు జోక్యం చేసుకుంది. ఆరు నెల‌ల్లోగా అమ‌రావ‌తిలో నిర్మాణాలు పూర్తి కావాల‌ని ఆదేశాలిచ్చింది. దీనిపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం అఫిడ‌విట్ చేసింది. ఆరు నెల‌ల్లోగా నిర్మాణాలు పూర్తి కావ‌డం సాధ్యం కాద‌ని.. అంత డ‌బ్బు ప్ర‌భుత్వం వ‌ద్ద లేద‌ని వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

మ‌రోవైపు రాజధాని అమ‌రావ‌తిలో అక్ర‌మార్కులు ధ్వంస ర‌చ‌న‌కు దిగుతున్నారు. ఇప్ప‌టికే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వేసిన రోడ్ల‌ను తవ్వేశారు. గ్రావెల్‌, మ‌ట్టి త‌దిత‌రాల‌ను పెద్ద ఎత్తున త‌ర‌లించుకుపోయారు. మ‌రికొన్ని రోడ్ల‌పైన ప‌శువుల‌ను క‌ట్టివేస్తున్నారు. ఇదంతా జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేయిస్తుందేన‌ని టీడీపీ ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు కురిపించింది.

అలాగే తాజాగా రాజ‌ధాని ప‌రిధిలో 2001లో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ప్రారంభించిన రాయ‌పూడి లిఫ్ట్ ఇరిగేష‌న్ ప‌థ‌కాన్ని కూడా దుండ‌గులు దోచుకుంటున్నారు. లిఫ్ట్ ఇరిగేష‌న్ ప‌థ‌కానికి సంబంధించిన పైపుల‌ను ఎక్క‌డిక‌క్క‌డ త‌వ్వేసి వాటిని ఎత్తుకుపోతున్నారు.

రాజ‌ధాని ప‌రిధిలోని తుళ్లూరు మండ‌ల ప‌రిధిలో రాయ‌పూడి ఎత్తిపోత‌ల ప‌థ‌కం ఉంది. ఈ పైపుల‌ను దుండ‌గులు అప‌హ‌రించారు. ఒక్కో కాంక్రీట్ పైపు ధర రూ.50 వేలు కాగా ఇప్పటి వరకు 150 భారీ పైపులను తవ్వి త‌ర‌లించుకుపోయారు. దుండగులు విలువైన వస్తువులను కూడా దోచుకెళ్లి గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. అది కూడా ప‌ట్ట‌ప‌గ‌లే ఇది జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. పోలీసులు ఆలస్యంగా రంగంలోకి దిగి చోరీకి పాల్పడిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నాలుగు పైపులు, ఒక‌ ట్రాక్టర్, జేసీబీని స్వాధీనం చేసుకున్నారు.

అయితే దుండ‌గులు పగటిపూట బ‌హిరంగంగా పైపులను తవ్వి ట్రాక్టర్లలో త‌ర‌లించుకుపోతుంటే అధికారులు, రాజధాని ప్రాంత యంత్రాంగం ఏం చేస్తోందనే ప్రశ్న ఉద‌యిస్తోంది. రెండు దశాబ్దాల క్రితం రూ.14 కోట్లతో నిర్మించిన లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ప‌రిక‌రాల‌ను దుండ‌గులు ఎత్తుకుపోవ‌డం ప్ర‌మాద‌క‌ర‌మంటున్నారు.

ఇతర నీటిపారుదల ప్రాజెక్టుల వద్ద ఇలాంటి ప‌రిస్థితి త‌లెత్తితే పెను ప్ర‌మాదాలు త‌లెత్తుతాయ‌ని అంటున్నారు. అప్పుడు జ‌రిగే న‌ష్టం ఊహ‌కు కూడా అంద‌ద‌ని చెబుతున్నారు. ప్రాజెక్టుల వ‌ద్ద శాంతిభ‌ద్ర‌త‌ల లోపం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని ప్ర‌తిపక్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. అందుకు నిద‌ర్శ‌న‌మే ఈ ఘ‌ట‌న అని ఆరోపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.