Begin typing your search above and press return to search.

గోళ్లు గిల్లుకుంటున్న దొంగ‌లు

By:  Tupaki Desk   |   25 Nov 2016 1:30 AM GMT
గోళ్లు గిల్లుకుంటున్న దొంగ‌లు
X
500 - 1000 నోట్ల ర‌ద్దుతో జ‌నం క‌ష్టాలు ప‌డుతుండ‌డం కాద‌న‌లేని స‌త్య‌మే అయినా అదే స‌మ‌యంలో స‌మాజంలో కొన్ని సానుకూల మార్పులూ క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా న‌గ‌దు సంబంధిత నేరాలు - ప‌రోక్షంగా మ‌రికొన్ని నేరాలు అదుపులోకి వ‌చ్చాయి. పోలీసు శాఖ వంటివి దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి వివ‌రాలు వెల్ల‌డించ‌క‌పోయినా మీడియాలో వ‌చ్చే వార్త‌ల ఆధారంగా ఈ మార్పు స్ప‌ష్టంగా గుర్తించ‌డానికి అవ‌కాశ‌మేర్ప‌డుతోంది. ముఖ్యంగా దొంగ‌త‌నాలు బాగా క‌ట్ట‌డ‌య్యాయి. అంతేకాదు... నాలుగు నెల‌లుగా అట్టుడుకుతున్న క‌శ్మీర్ లో అల్ల‌ర్లు ఒక్క‌సారిగా ఆగిపోయాయి. అవ‌న్నీ పాక్ ఫైనాన్సుడ్ అల్ల‌ర్లు కావ‌డంతో వారికి డ‌బ్బులు స‌ర‌ఫ‌రా కాక అల్ల‌రిమూక‌లు సైలెంట‌యిపోయాయి. అంతేకాదు... దేశ‌వ్యాప్తంగా దారిదోపిడీలు - జేబు దొంగ‌త‌నాలు - ఇళ్ల‌లో దొంగ‌త‌నాలు గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయాయి.

గ‌తంలో మాదిరిగా నోట్ల కట్టలను పట్టుకొని వస్తువులు ఖరీదు చేసేందుకు వెళ్లేవారే లేక‌పోవ‌డంతో జేబు దొంగ‌ల కత్తెర‌కు ప‌దును త‌గ్గిపోయింది. అంతేకాదు.. బ్యాంకుల‌కు క‌ట్ట‌లుక‌ట్టలుగా న‌గ‌దు తీసుకెళ్తున్నా అవ‌న్నీ పాత నోట్లు కావ‌డంతో దొంగ‌లు అటువైపే చూడ‌డం లేదు. ఇక న‌గ‌దు అందుబాటులో లేక ఉన్నదాంట్లోనే పెళ్లి తంతును జరిపించేందుకు మధ్యతరగతి వర్గాలవారు సిద్ధపడటంతో కిరాణా - వస్త్ర - బంగారు షాపుల సముదాయాల వద్ద రద్దీ లేదు. దాంతో అలాంటి చోట్ల జ‌రిగే దొంగ‌త‌నాలూ బంద‌య్యాయి. ఇక బ్యాంకులు - ఏటీఎంల నుంచి న‌గ‌దు విత్ డ్రా చేయ‌డానికి పరిమితులు ఉండ‌డంతో ఎవ‌రి వ‌ద్దా న‌గ‌దు లేదు. దీంతో ఇళ్ల‌లోనూ నాలుగయిదు వేల‌కు మించి డ‌బ్బు ఉండ‌డం లేదు. దీంతో క‌ష్ట‌ప‌డి క‌న్న‌మేసినా గిట్టుబాటు కాద‌న్న ఉద్దేశంతో దొంగ‌లు రిస్కు తీసుకొని ఇళ్ల గ‌డియ‌లు క‌ట్ చేయ‌డం మానేశారు. మొత్తానికి న‌వంబ‌రు 8న న‌ల్ల‌ధ‌న‌వంతుల‌పై వేసిన మోడీ దొంగ‌దెబ్బ‌కు అన్ని ర‌కాల దొంగ‌ల ఆట‌క‌ట్టిన‌ట్ట‌యింది.

క్యాష్ లావాదేవీలు ఎక్కువ‌గా జ‌రిగే తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్ర‌భావం బాగా క‌నిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత విజయవాడ - విశాఖ పట్టణం - గుంటూరు - తిరుపతి - రాజమండ్రి - ఏలూరు వంటి ప్రధాన నగరాల్లో జేబు దొంగతనాలు - బ్యాగుల లిఫ్టింగ్‌ పై కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో జేబు దొంగతనాలకు గుంటూరు జిల్లా తాడేపల్లి - స్టూవర్టుపురం ముఠాలు పెట్టింది పేరు. గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రధాన పట్టణాల్లో వీరితో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన కొన్ని ముఠాలు కూడా సంచరిస్తున్నాయి. పెళ్లిల్లు - ఉత్సవాల సీజన్లే వీరి చోరీలకు తగిన సమయంగా ఎంచుకుంటారు. ఇప్పడు అసలే పెళ్లిళ్ల సీజన్‌, దీనికి తోడు కార్తీక మాసం కావడంతో రద్దీ ప్రాంతాల్లో, దేవాలయాల వద్ద కళ్లల్లో ఒత్తులు వేసుకొని గస్తీ తిరిగే సీసీఎస్ పోలీసులు కాస్త రిలాక్స‌వుతున్నారు. నోట్ల రద్దు పుణ్యమా అంటూ తీరిక దొర‌క‌డంతో స్టేష‌న్ల‌లోనే ఉంటూ పెండింగ్‌ కేసులపై దృష్టిసారిం చారు.

సాధార‌ణంగా జేబు దొంగలు నగదు కాజేసిన తర్వాత విలాస జీవితం గడుపుతారు. మద్యం సహా దొంగిలించిన నగదు ఖర్చయ్యే వరకు వీరు జల్సాలు చేస్తారు. కానీ ర‌ద్ద‌యిన‌ పెద్ద నోట్ల మార్పిడీ అవకాశాలు లేక చోరీలకు స్వస్థి చెప్పినట్టు పోలీసు అధికారులు అంటున్నారు. ఒక వేళ బ్యాం కుల వద్ద క్యూలో నిలబడి నోట్లు మార్చుకోవాలంటే పోలీసులకు దొరికిపోతారు. దీంతో దొంగ‌లంతా చేతులు ముడుచుకుని కూర్చున్నార‌ని పోలీసులు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/