Begin typing your search above and press return to search.

గులాబీ ఎంపీ ఇంట్లో చోరీ మ‌రీ అంత ఈజీనా?

By:  Tupaki Desk   |   28 Sep 2017 5:18 AM GMT
గులాబీ ఎంపీ ఇంట్లో చోరీ మ‌రీ అంత ఈజీనా?
X
చోటా నాయకుడి ఇంటి వైపు క‌న్నేత్తి చూడ‌టానికే వ‌ణికిపోయే రోజులివి. అలాంటిది ఏకంగా ఒక ఎంపీ ఇంటిని అదే ప‌నిగా చోరీ చేస్తున్న వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. తెలంగాణ అధికార‌ప‌క్షానికి చెందిన అదిలాబాద్ ఎంపీ న‌గేష్ ఇంట్లో మ‌రోసారి చోరీ జ‌రిగింది.

ఇప్ప‌టికి రెండుసార్లు ఆయ‌న ఇంట్లో దొంగ‌త‌నం జ‌ర‌గ్గా.. తాజాగా జ‌రిగిన చోరీ మూడోది కావ‌టం గ‌మ‌నార్హం. వ‌రుస‌గా జ‌రుగుతున్న దొంగ‌త‌నాలు ఇప్పుడు క‌ల‌క‌లంగా మారాయి. సెక్యూరిటీ.. సిబ్బంది అంత‌మంది ఉండ‌గా దొంగ‌లు దొంగ‌త‌నం చేయ‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం దొర‌క‌టం లేదు.

1999లో ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రించిన న‌గేష్‌.. 2004 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు. తిరిగి 2009లో టీడీపీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన ఆయ‌న‌.. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో సైకిల్ దిగేసి గులాబీ కారు ఎక్కేశారు. రాజ‌కీయంగా సుదీర్ఘ‌కాలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న న‌గేష్ ఇంట్లో త‌ర‌చూ చోరీలు జ‌రుగుతున్నాయి. 2008లో ఆయ‌న మాజీ ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు ఆయ‌న ఇంట్లో తొలిసారి దొంగ‌త‌నం జ‌రిగింది.

అప్ప‌ట్లో రూ.50వేలు ఎత్తుకెళ్లిన వైనం సంచ‌ల‌నంగా మారింది. త‌ర్వాత 2013లో మ‌రోసారి దొంగ‌త‌నానికి ప్ర‌య‌త్నించారు కానీ ఆ ప్లాన్ విఫ‌ల‌మైంది. తాజాగా ఎంపీగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న ఇంట్లో మరోసారి దొంగ‌త‌నం చోటు చేసుకుంది. తెల్ల‌వారుజాము ప్రాంతంలో ఆయ‌న ఇంట్లోకి ప్ర‌వేశించిన దొంగ‌లు రూ.15లక్ష‌లు విలువైన బంగారు ఆభ‌ర‌ణాల్ని.. రూ.75వేల న‌గ‌దును దోచుకెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు.

మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. చోరీకి వ‌చ్చిన దొంగ‌లు సీసీటీవీ పుటేజ్ ల‌తో పాటు డీబీఆర్ బాక్స్‌ ను కూడా ఎత్తుకెళ్ల‌టంతో దొంగ‌ల్ని ఎలా ప‌ట్టుకోవాలో అర్థం కాని ప‌రిస్థితి పోలీసుల‌కు ఎదుర‌వుతోంది. ఇదిలా ఉంటే.. వారం క్రితం జైలు నుంచి విడుద‌లైన అదిలాబాద్‌ కు చెందిన దొంగ‌లే ఎంపీ ఇంట్లో చోరీ చేసి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా.. అధికారపార్టీకి చెందిన ఎంపీ ఇల్లు మ‌రీ ఇంత సాఫ్ట్ టార్గెట్ గా మార‌టం ఏమిట‌న్నది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఒక ప్ర‌ముఖ నేత ఇంట్లో చోరీ దొంగ‌ల‌కు మ‌రీ ఇంత ఈజీ గా ఉండ‌టం ఏమిట‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.