Begin typing your search above and press return to search.

పగలు ట్రాఫిక్ సిగ్నల్.. రాత్రి పని కానిస్తారు..!

By:  Tupaki Desk   |   16 Feb 2022 11:30 PM GMT
పగలు ట్రాఫిక్ సిగ్నల్.. రాత్రి పని కానిస్తారు..!
X
ఏదైనా నగరంలో ట్రాఫిక్ సిగ్నల్ కనిపిస్తే చాలు... టెంప్ట్ అయిపోతారు. చుట్టూ ఉన్న పరిసరాలను నిశితంగా పరిశీలిస్తారు. రాత్రి వేళలో గుట్టుచప్పుడు కాకుండా వస్తారు. ఎవరికీ అనుమానం రాకుండా పని కానిచ్చేస్తారు. అయితే గతేడాది జూన్ నుంచి ఇదే తంతు. స్కూటీపై తిరగడం. ట్రాఫిక్ సిగ్నల్ కేంద్రాలను చూడడం...చడీచప్పుడు లేకుండా పని పూర్తిచేయడం. ఇలా చేస్తూ... చేస్తూ... పోలీసులకు చిక్కారు.

నిందితులిద్దరినీ పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు... వారిని ప్రశ్నించారు. కాగా పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెల్లడయ్యాయి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాళ్లు చేసే పని చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు.

నజ్మా, సికిందర్ అనే దంపతులు హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నారు. సికిందర్ టీ కొట్టు నడుపుతుంటారు. నజ్మా గార్మెంట్ దినసరి కూలీగా పని చేస్తుంటుంది. ఇదంతా పగటి ముచ్చట. రాత్రి అయితే వాళ్లు వేరే పనుల్లో బిజీ అవుతారు. స్కూటీ మీద చక్కర్లు కొడుతూ.. సిగ్నల్ లను పరిశీలిస్తారు. ఇక తెల్లవారు జామున 3 గంటల నుంచి ఐదు గంటల్లోపు రంగంలోకి దిగుతారు. ద్విచక్ర వాహనం నంబర్ కనిపించకుండా లైట్లు ఆఫ్ చేస్తారు.

అనంతరం సిగ్నల్ సెంటర్ వద్దకు వచ్చి... బ్యాటరీలను దొంగిలిస్తారు. ఇలా నగరంలోని చాలా కూడళ్లలో ఇటువంటి సంఘటనలు ఇటీవల చాలా జరుగుతున్నాయి. అనుమానం వచ్చిన పోలీసులు అందుకు గల కారణాలపై ఆరా తీశారు.

ఇద్దరు వ్యక్తులు రాత్రివేళలో ట్రాఫిక్ సిగ్నల్ బ్యాటరీలను దొంగిలించడం గుర్తించారు. అయితే వారిని పట్టుకుందామంటే... స్కూటీ నంబర్ కనిపించకుండా చేశారు. చేసేది లేక ఆ మోడల్ లో ఉన్న దాదాపు 4 వేల ద్విచక్రవాహనాలను పరిశీలించారు. 300 మందిని విచారణ జరిపారు. అలా ఒక్కో స్టెప్పులో విచారణ జరుపుతూ... చివరకు ఆ ఇద్దరినీ పట్టుకున్నారు. బ్యాటరీలు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించారు. అయితే వీరు గతేడాది జూన్ నుంచి కూడా ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు అంగీకరించారని పోలీసులు వెల్లడించారు.

పగలంతా వేరే పనుల్లో ఉండే ఆ దంపతులు రాత్రివేళలో ఈ చోరీలకు పాల్పడుతున్నారు. బ్యాటరీలను అపహరించి స్క్రాప్ కింద అమ్ముతున్నారు. ఈ విధంగా కొంతమొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు. అయితే ఇక్కడే కాదు ఇతర నగరాల్లోనూ ఇలాంటి చోరీలు చేసినట్లు నిందితులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. బెంగళూరులోని పలు కూడళ్లలోనూ ఇలాంటి అపహరణలు జరిగాయని పేర్కొన్నారు. ఇకపోతే నిందితుడు సికిందర్ పై ఇతర కేసులు కూడా ఉన్నాయని తెలిపారు.