Begin typing your search above and press return to search.

‘‘అల్లుడుగారికి’’ లోక్ సభ నోటీసులు ఇచ్చేసింది

By:  Tupaki Desk   |   28 July 2015 5:28 AM GMT
‘‘అల్లుడుగారికి’’ లోక్ సభ నోటీసులు ఇచ్చేసింది
X
అల్లుడిగారిగా అపరిమితమైన అధికారాన్ని అనుభవించేసిన గాంధీ ఇంట అల్లుడు రాబర్ట్ వాద్రాకు ఇబ్బందికర రోజులు మొదలైనట్లే. దేశాన్ని రిమోట్ కంట్రోల్ తో కంట్రోల్ చేసిన రోజుల్లో అల్లుడిగారి హవా ఒక రేంజ్ లో సాగింది.

ఆయన వైపు కన్నేసి చూసే ధైర్యం చేయలేని పరిస్థితి. తాజాగా.. మోడీ సర్కారుపై ఫేస్ బుక్ లో తీవ్ర విమర్శలు చేసిన రాబర్ట్ వాద్రాపై మోడీ సర్కారు కన్నెర్ర చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యల్ని అభ్యంతరకరమైనవిగా.. లోక్ సభ సభ్యుల్ని కించపరిచేలా ఉన్నాయంటూ లోక్ సభ తాజాగా నోటీసులు జారీ చేసింది. నిజానికి ఫేస్ బుక్ లో వాద్రా చేసిన వ్యాఖ్యలు కాస్తంత ఘాటుగా ఉన్నాయే తప్పించి.. అనుచితంగా.. అభ్యంతరకరంగా లేవన్న వాదన వినిపిస్తోంది.

రాజకీయ ప్రత్యర్థుల పీచమణిచేలా వ్యవహరించటం మోడీకి కొత్తేం కాదు. ఆయన నిత్యం వల్లించే ధర్మ సూత్రాలు.. స్ఫూర్తివంతమైన మాటలకు భిన్నంగా వ్యవహరిచటం కొత్తేం కాదు. అదే తీరును ఆయన తాజాగా అల్లుడిగారి మీద కూడా ప్రయోగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తాను చేసిన అనుచిత వ్యాఖ్యలపై వారం రోజుల్లో సంజాయిషీ చెప్పాలంటూ వాద్రాకు నోటీసులు ఇచ్చారు.

లోక్ సభ తనకు పంపిన నోటీసులకు రాబర్ట్ వాద్రా ఏ విధంగా స్పందిస్తారో చూసి.. ఆయనిచ్చిన సమాధానాన్ని అనుసరించి.. సభాహక్కుల సంఘానికి ఆయన వ్యాఖ్యల్ని నివేదించాలా? లేదా? అన్న విషయాన్ని డిసైడ్ చేస్తారని చెబుతున్నారు. రాబర్ట్ వాద్రా విషయంలో మోడీ సర్కారు అనవసరమైన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుందన్న మాట వినిపిస్తోంది. ఈ వ్యవహారం కచ్ఛితంగా రాజకీయ రంగు అద్దుకోవటంతో పాటు.. కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణ మూటగట్టుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.