Begin typing your search above and press return to search.

అల్లుడిగారిని ఇక తడిమేస్తారు

By:  Tupaki Desk   |   22 Aug 2015 7:16 AM GMT
అల్లుడిగారిని ఇక తడిమేస్తారు
X
ఎలాంటి రాజ్యాంగపరమైన పదవులు లేనప్పటికీ.. దేశంలోకెల్లా వీవీఐపీ ట్రీట్ మెంట్ పొందిన.. దేశానికే అల్లుడి హోదా పొందే అదృష్టం సోనియాగాంధీ అల్లుడు.. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు మాత్రమే దక్కింది. గాంధీ కుటుంబానికి చెందిన ఇంటి అల్లుడు కావటంతో అయ్యగారి రాజభోగానికి అంతే లేదు. అందులోకి పదేళ్లు.. సోనియమ్మ రిమోట్ కంట్రోల్ మాదిరి దేశానికి దిశానిర్దేశం చేస్తున్న సమయంలో ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రా హవా ఎంత నడవాలి.

అందుకే.. ఆయన ఎలాంటి రాజ్యాంగపరమైన పదవుల్లో లేప్పటికీ.. విమానాశ్రయాల దగ్గర నుంచి చాలాచోట్ల వీవీఐపీలకు ఎలాంటి ప్రోటోకాల్ మొయింటైన్ చేసే వారో అదే స్థాయిలోనే ఆయనకు గౌరవ మర్యాదలు జరిగేవి. మరింత రాజమర్యాదలు జరుగుతుంటే ఎవరు మాత్రం బుద్ధిగా ఉంటారు. అందుకేనేమో.. తనకున్న హోదా.. పలుకుబడితో హర్యానాలో అయ్యగారు ఓ రేంజ్ లో చెలరేగిపోయారు. భూముల మీద కన్నేసి వందలాది కోట్ల రూపాయిలు వెనకేశారన్న పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారు.

మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత.. అయ్యగారి రాజభోగాల గురించి బయటకు వచ్చింది. ఏ హోదా లేకుండానే విమానాశ్రయాల్లో ఎలాంటి తనిఖీల్లేకుండా దొరబాబులా ఎలా పోనిస్తారంటూ ప్రవ్నలు మొదలయ్యాయి. దీంతో.. ఎవరూ ప్రశ్నించని తన భర్త గురించి ప్రతిఒక్కరూ ప్రశ్నిస్తుండటంతో యువరాణిలా వెలిగిపోయే ప్రియాంకమ్మకు కోపం వచ్చేసింది. ఎంత చెడ్డా భర్తను పట్టుకొని అన్నేసి మాటలు అంటుంటే ఉప్పుకారం తినే ప్రియాంకమ్మకు ఒళ్లు మండదా? అందుకేనేమో.. విమానాశ్రయాల్లో తమకు కల్పిస్తున్న సదుపాయాలేమీ అక్కర్లేదంటూ లేఖ రాసేసింది.

తాజాగా విమానాశ్రయాల్లో తనిఖీల్లేని ప్రముఖుల జాబితా నుంచి వాద్రా పేరును తొలగించాలని కేంద్రం నిర్ణయించింది. తాజాగా ఆయన పేరు తొలగించేశారు. ఇంతకాలం.. ఇటు స్వదేశంలోనూ.. అటు విదేశాల్లోనూ ఎలాంటి తనిఖీల్లేకుండా దర్జాగా వెళ్లిపోయే వాద్రాకు.. ఇప్పుడు అందరి మాదిరి ఎయిర్ పోర్టులలో తనిఖీలు చేయించుకోక తప్పని పరిస్థితి. చూస్తుంటే.. అల్లుడిగారికి పెద్ద కష్టమే వచ్చిపడ్డట్లుందే.