Begin typing your search above and press return to search.

మోదీజీ!... వాద్రాను రాజ‌కీయాల్లోకి లాగారే!

By:  Tupaki Desk   |   25 Feb 2019 2:30 PM GMT
మోదీజీ!... వాద్రాను రాజ‌కీయాల్లోకి లాగారే!
X
జాతీయ రాజ‌కీయాల్లోకి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ బావ‌ - పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ప్రియాంకా గాంధీ భ‌ర్త రాబ‌ర్ట్ వాద్రా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మైపోయారు. మొన్న త‌న స‌తీమ‌ణి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల‌క బాధ్య‌త‌లు చేప‌ట్టిన సంద‌ర్భంగా ఆమెను జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని, భ‌ద్రంగా కాపాడుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు విన్న‌వించిన వాద్రా... రాజ‌కీయాల్లోకి వెళ్లిన త‌న భార్యకు ఎలాంటి ప్ర‌మాదం ముంచుకొస్తుందోన‌న్న ఆందోళ‌న‌ను వెలిబుచ్చారు. అయితే ఆ ప్ర‌క‌ట‌న చేసి నెల కూడా తిర‌గ‌క ముందే స్వ‌యంగా తాను కూడా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చేసే దిశ‌గా వాద్రా క‌దులుతున్న తీరు నిజంగానే ఆస‌క్తి క‌లిగించేదే.

అయినా ఉన్న‌ట్టుండి ఇప్పుడు సెడ‌న్ గా వాద్రా పొలిటికల్ ఎంట్రీకి ఎందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌న్న ప్ర‌శ్న ఇప్పుడు అంద‌రి మెద‌ళ్ల‌ను తొలుస్తోంద‌నే చెప్పాలి. త‌న‌పై న‌మోదైన కేసులు - వాటి ద‌ర్యాప్తులో భాగంగా వ‌రుస పెట్టి మ‌రి తాను విచార‌ణ సంస్థ‌ల‌కు వెళ్లాల్సి రావ‌డం, విచార‌ణ సంద‌ర్భంగా ఎదురైన క్లిష్ట ప్ర‌శ్న‌లు... వాద్రాను పాలిటిక్స్ వైపు దృష్టి మ‌ళ్లించేశాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. వాద్రాపై కేసులు ఇప్పుడు కొత్త కాకున్నా... ఆ కేసుల‌పై మాత్రం ఇప్పుడు విచార‌ణ బుల్లెట్ రైల్ మాదిరి ప‌రుగులు పెడుతోంది. ఈ విచార‌ణ‌లో ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌ల‌కు వాద్రా స‌మాధానం చెప్ప‌లేక నానా యాత‌న ప‌డుతున్నారు. *నా ఆరోగ్యం బాగా లేదు. నేను మందులు వేసుకోవాలి. న‌న్ను ఇంటికి వెళ్ల‌నీయండి* అంటూ మొన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారుల వ‌ద్ద వాద్రా మొర‌పెట్టుకున్న తీరు... విచార‌ణ సంద‌ర్భంగా ఆయ‌న ఎంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నార‌న్న విష‌యాన్ని ఇట్టే చెప్పేసింది.

ఈ క్ర‌మంలో ఈ త‌ర‌హా ఇబ్బందుల‌ను అల‌వోక‌గా ఎదుర్కోవాలంటూ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి తీరాల్సిందేన‌న్న భావ‌న‌కు వాద్రా వ‌చ్చిన‌ట్టుగా స‌మాచారం. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చే విష‌యంపై సూటిగా త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టని వాద్రా.. ప్ర‌జ‌ల‌కు మ‌రింత సేవ చేయాల‌నుంది అంటూ త‌న ఫేస్ బుక్ ద్వారా వెల్ల‌డించిన వైనం చూస్తుంటే... ఆయ‌న రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయంగానే క‌నిపిస్తోందని చెప్పాలి. మొత్తంగా వాద్రా కేసుల విచార‌ణ‌ల వేగం ప‌రిగే దిశ‌గా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీసుకున్న చ‌ర్య‌ల కార‌ణంగానే ఇప్పుడు వాద్రా రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు నిర్ణ‌యించుకున్న‌ట్లుగానే విశ్లేష‌ణ‌లు జ‌రుగుతున్నాయి.