Begin typing your search above and press return to search.

నిజాం మ్యూజియంలో చోరీ.. కోట్ల‌ల్లో చోరీ!

By:  Tupaki Desk   |   4 Sep 2018 5:14 AM GMT
నిజాం మ్యూజియంలో చోరీ.. కోట్ల‌ల్లో చోరీ!
X
నిజాం మ్యూజియంలో చోరీ చోటు చేసుకుంది. అత్యంత విలువైన వ‌స్తువుల్ని దొంగ‌లు టార్గెట్ చేశారు. ఇటీవ‌ల కాలంలో న‌గ‌రంలో చోరీల జోరు అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇళ్లు.. ఏటీఎంలు.. ఏ చిన్న అవ‌కాశం చిక్కినా దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న దొంగ‌లు తాజాగా మ్యూజియంను టార్గెట్ చేయ‌టం సంచ‌లనంగా మారింది.

సీసీ కెమేరాల‌కు చిక్క‌కుండా చేసిన ఈ చోరీ వ్య‌వ‌హారం చూస్తే.. ప‌క్కా ప్లాన్ తో ప్రొఫెష‌న‌ల్ దొంగ‌లే ఈ చోరీకి పాల్ప‌డి ఉంటార‌ని భావిస్తున్నారు. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం లోని పాత‌బ‌స్తీలోని పురానీ హ‌వేలి మ‌స్ర‌త్ మ‌హ‌ల్ లోని నిజాం మ్యూజియంలో తాజా చోరీ జ‌రిగింది. ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ చోరీ వివ‌రాలు సోమ‌వారం వెలుగు చూసాయి.

తాడు సాయంతో మొద‌టి అంత‌స్తులో ఉన్న గ్యాల‌రీ వెంటిలేట‌ర్ వ‌ద్ద‌కు చేరుకొని.. ఇనుప చువ్వ‌ల‌ను తొల‌గించి తొల‌గించి మ్యూజియం లోప‌ల‌కు చేరుకున్న‌ట్లుగా భావిస్తున్నారు. తాజాగా జ‌రిగిన భారీ చోరీలో రెండు కేజీల బ‌రువుతో ఉన్న బంగారు టిఫిన్ బాక్స్ తో స‌హా చెంచా.. క‌ప్పు.. సాస‌రూ పోయిన‌ట్లుగా గుర్తించారు. బంగారు టిఫిన్ బాక్స్ కు వ‌జ్రాలు పొదిగిన‌ట్లుగా చెబుతున్నారు.

పాత కాలం నాటివి కావ‌టం.. అరుదైన‌వి కావ‌టంతో వీటి విలువ కోట్ల‌ల్లో ఉంటుద‌న్న అంచ‌నాలు వినిపిస్తున్నాయి. సీసీ కెమేరాల‌తో పాటు.. ప్రైవేటు భ‌ద్ర‌తా సిబ్బంది మ్యూజియంకు కాపలా కాస్తున్నా.. వాటికి చిక్కుండా చోరీ చేసిన వైనం చూస్తే ప‌క్కా ప్లాన్ తోనే ఈ దోపిడీకి పాల్పడినట్లుగా చెబుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే మ్యూజియం భ‌ద్ర‌త‌ను గ్రూపులైన్ సంస్థ‌కు చెందిన ఎనిమిది మంది భ‌ద్ర‌తా సిబ్బంది ప‌ర్య‌వేక్షిస్తుంటారు. ఉద‌యం పూట ముగ్గురు.. రాత్రివేళ‌లో ఐదుగురు సిబ్బంది భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న‌ప్ప‌టికీ భారీచోరీ చోటు చేసుకోవ‌టం సంచ‌ల‌నంగా మారింది.