Begin typing your search above and press return to search.

పశువుల వేలంగా ఐపీఎల్ వేలం - రాబిన్ ఉతప్ప

By:  Tupaki Desk   |   22 Feb 2022 5:30 AM GMT
పశువుల వేలంగా ఐపీఎల్ వేలం - రాబిన్ ఉతప్ప
X
ఈ మధ్యన రెండు రోజుల పాటు యావత్ దేశంలోని అందరి అటెన్షన్ కు గురైన ఈవెంట్ ఏమైనా ఉందంటే అది.. ఐపీఎల్ వేలంగా చెప్పాలి. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా.. అన్నీ వర్గాల వారు.. రాజకీయాలకు అతీతంగా అందరూ ఆసక్తిగా చూసిన ఐపీఎల్ వేలం మీద చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. సంతలో పశువుల వేలాన్ని చూసినట్లుగా ఐపీఎల్ వేలం సాగిందన్న ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడుతున్న వైనాన్ని ఉతప్ప వర్ణించిన తీరు కొత్త తరహాగా ఉండటమే కాదు.. ఐపీఎల్ వేలాన్ని ఈ యాంగిల్ లో చూడాలన్న భావన కలుగుతుంది. ‘ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీ పడుతుంటే.. ఏదో వస్తువ కోసం పోటీ పడుతున్న దారుణమైన ఫీలింగ్ కలుగుతోంది. వేలం వేళ ఆటగాళ్లు కూడా మనషులే అన్న విషయాన్ని ఫ్రాంచైజీలు మర్చిపోయి ప్రవర్తిస్తాయి’ అంటూ ఫ్రాంఛైజీల తీరును తప్పు పట్టారు.

ఇక.. రాబిన్ ఉతప్ప విషయానికి వస్తే అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ రూ.2కోట్ల బేస్ ధరకు సొంతం చేసుకుంది. గత సీజన్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. మళ్లీ అదే జట్టుకు తాను ఆడాలన్నది తన కోరికగా పేర్కొన్నాడు. అందుకు దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లుగా చెప్పాడు. మొత్తానికి అతను కోరుకున్నట్లే చెన్నై జట్టు అతన్ని కొనుగోలు చేసింది. ఒకవేళ.. అతన్ని చెన్నై ఫ్రాంఛైజీ కాకుండా మరొకరు కొనుగోలు చేసుకొని ఉంటే? అన్న ఆలోచన చేసినప్పుడు ఉతప్ప మాటలు ఎందుకో ఇట్టే అర్థమవుతాయి.

ఇక.. వేలాన్ని తప్పు పట్టిన ఉతప్ప.. మరో కీలక అంశాన్ని వెల్లడించారు. ఆటగాళ్ల కోసం వేలం భారత్ లో మాత్రమే జరుగుతుందని.. రాబోయే రోజుల్లో ఈ తీరుకు స్వస్తి పలికితే బాగుంటుందన్నారు. వేలంలో అమ్ముడుకాని ఆటగాళ్ల మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించమన్న అతడి మాటలు విన్నంతనే నిజమే కదా? అన్న భావన కలుగక మానదు. అందుకే..అందరికి మేలు జరిగే విధానం అమల్లోకి రావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.