Begin typing your search above and press return to search.

జైలు పై రాకెట్ దాడి.. 53 మంది యుద్ధ ఖైదీలు మృతి

By:  Tupaki Desk   |   30 July 2022 7:39 AM GMT
జైలు పై రాకెట్ దాడి.. 53 మంది యుద్ధ ఖైదీలు మృతి
X
రష్యా-ఉక్రెయిన్‌ పోరులో శుక్రవారం భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌ ప్రాంతంలో ఉన్న ఒక కారాగారంపై రాకెట్లు విరుచుకుపడటంతో అందులో ఉన్న 53 యుద్ధ ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. మరో 75 మంది గాయపడ్డారు.

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారంతా మేరియుపొల్‌లో మే నెలలో జరిగిన పోరులో రష్యా కు పట్టుబడ్డ వారు. దీనిపై ఇరు దేశాలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి.

అమెరికా అందించిన 'హిమార్స్' రాకెట్‌ లాంచర్లతో ఉక్రెయిన్‌ జరిపిన దాడి వల్ల ఈ ప్రాణ నష్టం జరిగిందని రష్యా ఆరోపించింది. ఉక్రెయిన్‌ ప్రభుత్వం దీన్ని ఖండించింది. రష్యా సేన ఉద్దేశపూర్వకంగా దాడి చేసి, నిందను తమపై మోపుతోందని ఆరోపించింది. ఆ జైల్లో జరిగిన చిత్ర హింసలు, హత్యలను మరుగున పరచడానికే ఈ దురాగతానికి ఒడిగట్టిందని పేర్కొంది.

రష్యా అనుకూల వేర్పాటువాదుల ఆధీనంలోని ఒలెనివ్కా నగరంలో ఈ ఘటన జరిగింది. ఉక్రెయిన్‌ సైనికులు తమ బలగాలకు లొంగిపోకుండా అడ్డుకోవడమే ఈ దాడి ఉద్దేశమని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్‌ జనరల్‌ ఇగార్‌ కొనాషెంకోవ్‌ ఆరోపించారు.

గాయపడినవారిలో కారాగారానికి సంబంధించిన 8 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని చెప్పారు. జైల్లో మొత్తం 193 మంది ఖైదీలు ఉన్నారని రష్యా మద్దతున్న వేర్పాటువాద నాయకుడు డెనిస్‌ పుషులిన్‌ పేర్కొన్నారు. అయితే అందులో ఉక్రెయిన్‌ యుద్ధఖైదీలు ఎంతమందన్నది ఆయన వెల్లడిచేయలేదు.

దొనెట్స్క్‌లోని పౌర ప్రాంతాలపై రష్యా దాడులు ముమ్మరమయ్యాయని ఉక్రెయిన్‌ అధికారులు ఆరోపించారు. ఇక్కడ పోరు నానాటికీ తీవ్రమవుతోందని, పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. పట్టణాలు, గ్రామాల్లో రష్యా పెద్ద పెట్టున బాంబుల వర్షం కనిపిస్తోందన్నారు.