Begin typing your search above and press return to search.

రోహింగ్యా ముస్లింలు ఉగ్ర‌వాదులా?

By:  Tupaki Desk   |   19 Sep 2017 7:02 AM GMT
రోహింగ్యా ముస్లింలు ఉగ్ర‌వాదులా?
X
గ‌త కొన్ని రోజులుగా వార్తల్లో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న రోహింగ్యా ముస్లింల గురించి ఒళ్లు జ‌ల‌ద‌రించే నిజాల‌ను భార‌త్ వెలుగులోకి తెచ్చింది. మ‌య‌న్మార్‌ లో అక్క‌డి ప్ర‌భుత్వం, సైనిక వ‌ర్గాలు కూడా వీరిపై ఉక్కుపాదం మోపుతున్న విష‌యం తెలిసిందే. దీంతో మ‌య‌న్మార్‌ లో రోహింగ్యాలు ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ రోజులు గ‌డుపుతున్నారు. ఇక‌, ఈ దేశంలో రోహింగ్యాల‌పై జ‌రుగుతున్న అకృత్యాల‌పై ప‌లు దేశాల్లోని ముస్లింలు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. మాన‌వ హ‌క్కుల‌ను ఉక్కుపాదంతో తొక్కేస్తున్నార‌ని కూడా వారు ఆరోపించారు. ఈ విష‌యంలో ఐక్య‌రాజ్య‌స‌మితి జోక్యం చేసుకోవాల‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే బంగ్లాదేశ్ స్పందించింది. దాదాపు 4 ల‌క్ష‌ల మంది రోహింగ్యా శ‌ర‌ణార్థుల‌కు ప్ర‌త్యేక వ‌స‌తి సౌక‌ర్యం క‌ల్పించింది.

ఇదిలావుంటే, భార‌త్‌ లోనూ దాదాపు 40 వేల మందికిపైగా రోహింగ్యా ముస్లింలు ఉన్నార‌ని భార‌త్ లెక్క‌లు వెల్ల‌డించింది. వీరికి దేశంలో ఎక్క‌డా ఎంట్రీ లేద‌ని, అయితే వీరంతా శ‌ర‌ణార్థులుగానే ఉంటున్నార‌ని తెలిపింది. ఈ మేర‌కు ప్ర‌స్తుతం రోహింగ్యాల‌పై సుప్రీం కోర్టులో జ‌రుగుతున్న విచార‌ణ‌లో కేంద్ర ప్ర‌భుత్వం అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. ఈ సంద‌ర్భంగా రోహింగ్యాల‌కు సంబంధించి కొన్ని ఒళ్లు జ‌ల‌ద‌రించే విష‌యాల‌ను వెల్ల‌డించ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. భారత్-మయన్మార్‌ సరిహద్దు గుండా అక్రమంగా ఈ 40 వేల‌ మంది దేశంలోకి చొరబడ్డారని తెలిపింది. దేశంలో పలు ప్రాంతాల్లో విస్తరించిన వీరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

వీరిలో కొందరు పాకిస్థాన్‌ కు చెందిన కొన్ని ఉగ్రవాద సంస్థలతో కలిసి పని చేస్తున్నారని, ఈ విషయాన్ని నిఘా వర్గాలు కూడా కనిపెట్టాయని కేంద్రం త‌న అఫిడ‌విట్‌ లో పేర్కొంది. రోహింగ్యా శరణార్థులను ఇక్కడ కొనసాగించటం దేశ భద్రతకు పెను ముప్పేనని స్పష్టం చేసింది. ఈ వ్యవహరాన్ని తమకు వదిలేయాలని, చర్చలు.. విధాన నిర్ణయాల ద్వారా సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని కేంద్రం సుప్రీం కోర్టుకు విన్నవించింది. ఇక‌, ఈ కేసు విచార‌ణ అక్టోబ‌రు 3కు వాయిదా ప‌డింది. కానీ, కేంద్రం వెల్లడించిన విష‌యాల‌పైనే ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. భార‌త్‌-మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దు అంత వీక్‌ గా ఉందా? దాదాపు 40 వేల మందికిపైగా చొర‌బ‌డే వ‌ర‌కు భార‌త నిఘా వ‌ర్గాలు - సైనిక వ‌ర్గాలు ఏం చేస్తున్నాయి? ఈ విష‌యంలో ఎవ‌రిని త‌ప్పు ప‌ట్టాలి? ఎవ‌రి హ‌యాంలో ఈ చొర‌బాట్లు జ‌రిగాయి? అన్న కోణాల్లో విస్తృతంగా చ‌ర్చ‌లు సాగుతున్నాయి. మ‌రి నిజానిజాలు ఎప్ప‌టికి బ‌య‌ట‌కు వ‌స్తాయో చూడాలి.