Begin typing your search above and press return to search.

కోహ్లి రికార్డు రోహిత్ సమం.. మరో రికార్డుకు సమయం

By:  Tupaki Desk   |   22 Nov 2021 1:30 AM GMT
కోహ్లి రికార్డు రోహిత్ సమం.. మరో రికార్డుకు సమయం
X
టీమిండియా టీ20 కెప్టెన్ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ దూసుకెళ్తున్నాడు. న్యూజిలాండ్ పై వరుసగా రెండు విజయాలు సాధించాడు. రెండు మ్యాచ్ ల్లోనూ రాణించాడు. నేడు మూడో టి20 పై గురిపెట్టాడు. ఈ మ్యాచ్ లోనూ గెలవడం ద్వారా క్లీన్ స్వీప్ పై గురిపెట్టాడు. కాగా, రోహిత్ టి20ల్లో అరుదైన రికార్డుకు దగ్గరలో ఉన్నాడు.

శుక్రవారం న్యూజిలాండ్ తో మ్యాచ్ లో కేవలం 36 బంతుల్లోనే 5 ఫోర్లు, ఐదు సిక్స్ లతో 55 పరుగులు చేశాడు. ఈ అర్ధ సెంచరీతో రోహిత్ ఖాతాలో మొత్తం టి20 అర్ధ సెంచరీల సంఖ్య 29కి చేరింది. టీమిండియా టీ20 మాజీ సారథి విరాట్ కోహ్లీ తర్వాత అన్నే అర్ధ సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. అయితే, రోహిత్ 29 అర్ధ సెంచరీలకు 118 టీ20లు అవసరం కాగా, కోహ్లీ 91 మ్యాచుల్లోనే ఆ ఘనత సాధించడం విశేషం.

నేటి మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ బాదేస్తే..

రోహిత్ ఆదివారం కోల్ కతాలో జరుగనున్న మూడో టి20లోనూ అర్ధ శతకం చేస్తే ఈ ఫార్మాట్ లో అత్యధిక అర్ధ శతకాల రికార్డును అందుకుంటాడు. కెరీర్ పరంగా ప్రస్తుతం టాప్ గేర్ లో ఉన్న రోహిత్ మరికొన్ని రికార్డులూ బద్దలు కొట్టే అవకాశం కనిపిస్తోంది.

అందులోనూ అచ్చొచ్చిన టి20 ల్లో రోహిత్ కు మంచి రోజులు కనిపిస్తున్నాయి. కొంత కాలంగా టెస్టుల్లోనూ చోటు దక్కించుకుని ఓపెనర్ గా రాణిస్తున్నాడు రోహిత్. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలతో పాటు అత్యధిక వన్డే స్కోరు (267) ఘనతలు ఇప్పటికే తన పేరిట ఉన్నాయి. ఇప్పడు టి20ల్లో కెప్టెన్సీ చేతికి వచ్చినందున ఆ ఆత్మవిశ్వాసంతో చెలరేగితే పొట్టి ఫార్మాట్ లో రికార్డులు ఖాతాలో పడిపోవడం ఖాయం.

ఓపెనర్ కావడం కలిసొస్తోంది

కెరీర్ ప్రారంభంలో మిడిలార్డర్లో దిగి.. కాస్తో కూస్తో పరుగులు చేశాడు రోహిత్.. కానీ, ఓపెనర్ గా మారాక అతడి దశ తిరిగింది. మూడు ఫార్మాట్లలోనూ ఇలాగే జరగడం విశేషం. 2007లో తొలి 20 ఆడిన సమయంలో రోహిత్ లోయర్ మిడిలార్డర్ లో వచ్చాడు. కొంతకాలం అక్కడే కొనసాగాడు. వన్డేల్లోనూ అంతే. గంభీర్, సెహ్వాగ్, సచిన్ వంటి వారుండడంతో రోహిత్ కు ఓపెనింగ్ చాన్సు రాలేదు. ఇక టెస్టుల్లో అయితే అతడికి చోటే దక్కలేదు.

కానీ, 2013లో ఎప్పడైతే చాంపియన్స్ ట్రోఫీలో వన్డే ఓపెనర్ గా వచ్చాడో అప్పటినుంచి అతడి దశ మారిపోయింది. తర్వాత టి20ల్లో ,ఇప్పడు టెస్టుల్లో ఓపెనర్ గా స్థిరపడిపోయాడు. ఎంతో ప్రతిభ ఉన్నా ఓ దశలో జట్టులో చోటే ప్రశ్నార్థకమైన రోహిత్.. ఇప్పడు తిరుగులేని ఆటగాడిగా మారాడు.

వన్డే కెప్టెన్సీ అతడికేనా?

టి20 పగ్గాలు అందుకున్న రోహిత్ కు.. వన్డే సారథ్యం దక్కడం కూడా ఖాయమని తెలుస్తోంది. విరాట్ కోహ్లి నుంచి వన్డే కెప్టెన్సీ ని తప్పించి రోహిత్ కు ఇస్తారనేది టాక్. 50 ఓవర్ల ఫార్మాట్ లో మొనగాడిగా రోహిత్ కు పేరుంది. 2019 ప్రపంచ కప్ లో ఏకంగా 5 సెంచరీలు చేసి ఔరా అనిపించాడు. కాబట్టి వన్డేలు అతడికి నల్లేరుపై నడక. దీన్ని గమనించి, కోహ్లిపై భారం మరింత తగ్గించేందుకు రోహిత్ కే వన్డే సారథ్యం ఇస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి కొంత సమయం ఉంది. వచ్చే నెలలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.