Begin typing your search above and press return to search.

ఏంటి రోహిత్.. నువ్వు కూడా బూతులు తిడతావా?

By:  Tupaki Desk   |   10 July 2022 3:12 PM GMT
ఏంటి రోహిత్.. నువ్వు కూడా బూతులు తిడతావా?
X
అది 2017-18 క్రికెట్ సీజన్. భారత్.. దక్షిణాఫ్రికాతో టి20 మ్యాచ్ ఆడుతోంది. క్రీజులో మహేంద్ర సింగ్ ధోని, మనీశ్ పాండే. మనీశ్.. మిడ్ వికెట్ దిశగా బంతిని కొట్టాడు. ఇద్దరూ సింగిల్ తీశారు. కానీ, ధోని రెండో పరుగు కోసం ఆలోచిస్తున్నాడు. చురుగ్గా పరిగెత్తుతూ ఒక పరుగు వచ్చే దగ్గర రెండు, రెండు వచ్చేదగ్గర మూడు తీయడం ధోని స్టయిల్ అని తెలుసుగా? ఇక్కడా అలాగే డబుల్ తీయాలనుకున్నారు. అయితే, మనీశ్ మాత్రం ఎటో చూస్తున్నాడు. దీంతో ధోనికి చిర్రెత్తింది. ''ఓయె.. బోస్ దికే.. ఇదర్ దేఖ్ లె. ఉదర్ క్యా..?''అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదంతా స్టంప్ మైక్ లో రికార్డయింది. ఇప్పటికీ యూట్యూబ్ లో ఈ వీడియో కనిపిస్తుంది. ఇప్పుడీ సంగతి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే..? శనివారం ఇంగ్లండ్ తో జరిగిన రెండో టి20లో టీమిండియా సారథి రోహిత్ శర్మ.. ఓ ఫీల్డర్ పై ఇదే విధంగా తీవ్ర పదజాలంతో అరిచాడు. అందుకని..

ఇద్దరూ ప్రశాంత చిత్తులే.. ధోని, రోహిత్.. ఇద్దరూ ప్రశాంతంగా కనిపించేవారే. అయితే, వీరికి భిన్నం విరాట్ కోహ్లి. అతడిలో దూకుడెక్కువ. ప్రత్యర్థులను కవ్విస్తాడు కానీ, మైదానంలో సహచరులను దూషించినట్లు ఎప్పుడూ కనిపించడు. మరోవైపు నిత్యం సావధానంగా కనిపించే రోహిత్ శనివారం మ్యాచ్ లో సహనం కోల్పోయాడు. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన రెండో టీ20లో ఫీల్డర్ తప్పిదానికి ఆగ్రహానికి గురైన హిట్‌మ్యాన్ బూతులు తిట్టాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా నాలుగో ఓవర్ అనంతరం రోహిత్ శర్మ ఫీల్డర్‌కు తన పొజిషన్ గురించి చెబుతున్నాడు. అతడి మాటలను ఫీల్డర్ పట్టించుకోలేదు. చిర్రెత్తుకుపోయిన హిట్ మ్యాన్ నోటికి పనిచెప్పాడు. 'నేను మాట్లాడేటప్పుడు నన్నే చూడాలి'అని హిందీలో బూతులు తిట్టాడు.

స్టంప్ మైక్ లు వచ్చాక.. అన్నీ రికార్డే ఆధునిక సాంకేతికత క్రికెట్ లో వెంటనే అమల్లోకి వస్తుంది. ఇది క్రీడలను మరింత ఉన్నత ప్రమాణభరితం చేస్తుంది. ఇలాగే.. క్రికెట్ లో స్టంప్ మైక్ లు వచ్చాక ప్రతిదీ రికార్డవసాగింది. అంపైర్-ఆటగాళ్ల మధ్య వాదనలు, ఆటగాళ్లు-ఆటగాళ్లు మధ్య వివాదాలు, రెచ్చగొట్టుకోవడాలు.. ఇలా అన్నీ స్టంప్ మైక్ లో రికార్డవుతున్నాయి. అందుకే నాలుగైదేళ్ల కిందటి ధోని వ్యాఖ్యలు గానీ, నిన్నటి రోహిత్ వ్యాఖ్యలు గానీ.. అందరికీ వినిపించాయి.

చిల్ రోహిత్ భాయ్ అంటున్న నెటిజన్లు ఎక్కడ ఏం జరిగినా స్పందించడం నెటిజన్ల అలవాటనేది తెలుసుగా? దీనికితగ్గట్లే నిన్నటి రోహిత్ ఉదంతాన్నీ నెటిజన్లు తమ ఆయుధంగా చేసుకుంటున్నారు. రోహిత్ ప్రశాంతంగా ఉండాలంటూ సూచనలిస్తున్నారు. కూల్ రోహిత్ భాయ్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. కాగా, శనివారం మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత బ్యాటింగ్ కారణంగానే తమకు విజయం దక్కిందని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తీవ్ర ఒత్తిడిలో జడేజా అసాధారణ ప్రదర్శన కనబర్చాడని కొనియాడాడు. టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అతను అదే జోరును ఇక్కడ కొనసాగించాడని చెప్పాడు. విజయానంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. భారత ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. నేడు(ఆదివారం) జరిగే చివరి మ్యాచ్‌లో బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇస్తామని తెలిపాడు.