Begin typing your search above and press return to search.

కోహ్లీ - రోహిత్ మ‌ధ్య గ్యాప్ మ‌రింత పెరిగిందా... ఇన్‌ స్టాగ్రామ్ చెప్పేసింది

By:  Tupaki Desk   |   26 July 2019 9:41 AM GMT
కోహ్లీ - రోహిత్ మ‌ధ్య గ్యాప్ మ‌రింత పెరిగిందా... ఇన్‌ స్టాగ్రామ్ చెప్పేసింది
X
ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్‌ లోకి ఎన్నో అంచ‌నాల‌తో ఎంట్రీ ఇచ్చిన భార‌త్ సెమీస్‌ లో కీవీస్ చేతిలో ఓట‌మితో ఇంటికి వ‌చ్చేసింది. టోర్నీకి వెళ్లేముందు పులిగా క‌న‌ప‌డ్డ జ‌ట్టులో ఓట‌మితో అనేక గ్యాప్‌ లు, లొసుగులు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇండియా టీంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ- వైస్‌ కెప్టెన్ రోహిత్‌ శ‌ర్మ మ‌ధ్య గ్యాప్ ఉంద‌ని... ఆట‌గాళ్లు కూడా ఈ ఇద్ద‌రి గ్రూపులుగా విడిపోయార‌న్న వార్త‌లు అయితే బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

ఇక టీంలో ఎవ‌రెవ‌రు ఉండాల‌న్న‌ది కూడా కెప్టెన్- కోచ్ ర‌విశాస్త్రే డిసైడ్ చేసేవార‌న్న పుకార్లు షికార్లు కూడా చేశాయి. ప్ర‌పంచ‌క‌ప్‌ లో విజ‌య్‌ శంక‌ర్ ఘోరంగా విఫ‌ల‌మైన‌ప్పుడు కూడా సామ‌ర్థ్యం ఉన్న వాళ్ల‌ను కాకుండా కెప్టెన్‌- కోచ్‌ కు ఇష్టం ఉన్న వాళ్ల‌నే తీసుకున్నార‌ని కూడా అసంతృప్తి మొద‌లైంది. ఇక త్వ‌ర‌లోనే వెస్టిండిస్ టూర్‌ కు వెళుతోన్న నేప‌థ్యంలో ఈ వివాదాలు మ‌రింత‌గా ముదిరాయ‌ని తాజా ప‌రిణామాలు చెపుతున్నాయి.

ఇన్‌ స్టాగ్రామ్‌ లో కోహ్లి- అతడి భార్య అనుష్క శర్మను ఇప్ప‌టి వ‌ర‌కు ఫాలో అయిన రోహిత్‌ శ‌ర్మ ఇప్పుడు వారిద్ద‌రిని అన్‌ ఫాలో చేశాడ‌న్న వార్త క్రికెట్ వ‌ర్గాల్లోనే కాకుండా, అభిమానుల‌ను సైతం క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. ఇప్ప‌టికిప్పుడు రోహిత్ ఇలా చేయాల్సిన అవ‌స‌రం ఏం ఉంటుంది ? వారి మ‌ధ్య గ్యాప్ తీవ్రంగా ఉంటేనే రోహిత్ ఇలా చేసి ఉంటాడ‌న్న సందేహాలు ఇప్పుడు మ‌రింత ఎక్కువ‌య్యాయ్‌.

విరాట్ కోహ్లి మాత్రం ఇప్పటికీ ఇన్‌ స్టాగ్రామ్‌ లో రోహిత్ శర్మను ఫాలో అవుతున్నాడు. ఏదేమైనా కెప్టెన్‌- వైస్‌ కెప్టెన్ మ‌ధ్య ఉన్న ఈ గ్యాప్‌ ను స‌రిచేయ‌క‌పోతే ఆ ప్ర‌భావం జ‌ట్టులోని మిగిలిన ఆట‌గాళ్ల‌పై కూడా ప‌డుతుంద‌న్న ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి ఈ విష‌యంలో బీసీసీఐ ఏం చేస్తుందో ? చూడాలి.