Begin typing your search above and press return to search.

ప్లీజ్ రోహిత్.. ఆ పని చేయకు..: ఆర్సీబీ ప్లస్ కోహ్లి అభిమానులు

By:  Tupaki Desk   |   18 May 2022 11:30 AM GMT
ప్లీజ్ రోహిత్.. ఆ పని చేయకు..: ఆర్సీబీ ప్లస్ కోహ్లి అభిమానులు
X
అవర్ డియర్ రోహిత్..

నీకు, కోహ్లికి టీమిండియాలో ఎన్నో ఉండొచ్చు.. మీ ఇద్దరి మధ్య జట్టు రెండుగా చీలి ఉండొచ్చు.. అసలు కోహ్లి దూకుడుకు నీ సంయమనానికి సరిపడక పోవచ్చు.. జట్టుకు సంబంధించి మీ ఇద్దరి ఆలోచనల్లో తేడా ఉండొచ్చు.. అయినా, అదంతా గతం. ఇప్పుడు నువ్వే టీమిండియా సారథి. ఇంకో మాట.. ఇది ఐపీఎల్. ఎందరో విదేశీ, స్వదేశీ ప్లేయర్ల కలయిక. కాబట్టి కోహ్లిపై నీకు కోపం ఉండకూడదు. పైగా మీ జట్టు అత్యంత పేలవంగా ఆడుతోంది.. ఇక మీకేం ప్లే ఆఫ్స్ ఆశలు లేవు. ఇలాంటప్పుడు నువ్విలాంటి పని చేయడం తగదు...ఇదీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), విరాట్ కోహ్లి అభిమానుల మనసులోని మాట. వీరంతా ఎందుకిలా ప్రార్థిస్తున్నారంటే.. ఈ సీజన్ లో అత్యంత చెత్త ప్రదర్శన చేసింది రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్. 13 మ్యాచ్ లాడి మూడే గెలిచింది. ఐదుసార్లు టైటిల్ విజేత అయిన ముంబైకి లీగ్ లో ఎన్నడూ ఇలాంటి చెత్త ప్రదర్శన కనబర్చలేదు. జట్టు ఎంపికలో లోపాలు, ఆటగాళ్ల ఫామ్ దీనికి కారణం. ఇదంతా సహజమే అనుకున్నా.. ఇప్పుడు ఆ జట్టు ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలను దెబ్బకొట్టే స్థితిలో ఉంది.

ఢిల్లీతో మ్యాచ్ లో ముంబై మార్పులు

హార్దిక్ పాండ్యాను రిటైన్ చేసుకోలేదు. క్రునాల్ పాండ్యాను వద్దనుకుంది. రిటైన్ చేసుకున్న సూర్యకుమార్ యాదవ్ గాయాలతో సగం మ్యాచ్ లే ఆడగలిగాడు. మంచిఫామ్ లో ఉన్న అతడి సేవలు దూరమయ్యాయి. రూ.15 కోట్లు పెట్టి అట్టిపెట్టుకున్న ఇషాన్ కిషన్ తుస్ అనిపించాడు. బుమ్రా పెద్దగా రాణించింది లేదు. కెప్టెన్ రోహితే తేలిపోయాడు. ఇక రిటైన్ చేసుకున్న భారీ కాయుడు కీరన్ పొలార్డ్ అత్యంత దారుణంగా ఆడాడు. ఇక చెప్పుకునేందుకు ఏముంది ముంబైకి..? మంగళవారం నాటి సన్ రైజర్స్ తో మ్యాచ్ లో ఫినిషింగ్ లోపంతో మ్యాచ్ ను చేజార్చుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో ఆ జట్టు ఆడనుంది. ఇందులో నెగ్గితే
పరోక్షంగా ఆర్‌సీబీకి మేలు చేసినట్లు. కానీ, ముంబై వ్యూహాలు వేరేలా ఉన్నాయి. అవే ఆర్సీబీ-కోహ్లి అభిమానులను కంగారు పెడుతున్నాయి.

ఆర్సీబీ అంతంతే.. కానీ, ముంబై గెలవాలి

ప్లే ఆఫ్స్ దిశగా ఆర్సీబీ పరిస్థితి కూడా అంత గొప్పగా ఏమీ లేదు. 13 మ్యాచ్ ల్లో ఏడే గెలిచింది. గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో భారీ విజయాన్నందుకోవాలి. 14 పాయింట్లతో టేబుల్‌లో ఐదో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ.. టైటిల్ రేసులో నిలవాలంటే గుజరాత్‌పై ఖచ్చితంగా గెలవాలి. ఇదే సమయంలో ఇప్పటికే 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. ముంబై చేతిలో ఓడాలి. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ గెలవాలని ఆర్‌సీబీ అభిమానులు కోరుకుంటున్నారు.

మార్పులు చేస్తే ఆర్సీబీకి మునకే

వరుస పరాజయాలతో డీలా పడిన ముంబై.. రాబోయే మ్యాచ్ లో మార్పులు చేస్తామంటోంది. ప్లే ఆఫ్స్ కు దూరమైన నేపథ్యంలో చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌ నుంచి ప్రయోగాలు చేపట్టిన ముంబై.. పొలార్డ్ను తప్పించింది. సన్‌రైజర్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో రెగ్యూలర్ స్పిన్నర్లు ఇద్దరిని పక్కనపెట్టి సంజయ్ యాదవ్, మయాంక్ మార్కెండేలను ఆడించింది. ఈ ఇద్దరు పెద్దగా ప్రభావం
చూపకపోగా.. చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేసేవారు లేక సునాయసంగా గెలిచే మ్యాచ్‌లో 3 పరుగులతో ఓటమిపాలైంది.

అర్జున్ టెండూల్కర్‌కు చాన్స్..

ఇక ఈ మ్యాచ్ ముగింపు సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. చివరి మ్యాచ్‌లోనూ ఇప్పటి వరకు అవకాశం రాని యువ ఆటగాళ్లకు చోటిస్తామని తెలిపాడు. విజయం కన్నా భవిష్యత్తు నేపథ్యంలో కోర్ టీమ్‌ను పరీక్షించుకోవడం తమకు అత్యంత ముఖ్యమని చెప్పాడు. ఈ వ్యాఖ్యలే ఆర్‌సీబీ అభిమానులను కలవరపెడుతున్నాయి. రోహిత్ చెప్పినదాట్టి బట్టి చూస్తే జట్టులో ఇప్పటి వరకు అవకాశం దక్కించుకోని ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), అర్జున్ టెండూల్కర్(బౌలర్), ఆకాశ్ మధ్వాల్(బౌలర్), రాహుల్ బుద్ది (బ్యాటర్) అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరవద్దనే..

ఈ నలుగురికి అవకాశం ఇవ్వాలంటే.. రోహిత్, ఇషాన్ కిషన్, బుమ్రా, రమణ్ దీప్ సింగ్‌లు తప్పుకోవా. కెప్టెన్ రోహిత్ కొనసాగినా తిలక్ వర్మను పక్కనపెట్టాల్సి ఉంటుంది. ఈ సీజన్ లో ముంబై టాప్ స్కోరరే తిలక్. అతడినీ తప్పిస్తే ముంబై ఇండియన్స్ అత్యంత బలహీనంగా మారుతోంది. ఇది ఢిల్లీ క్యాపిటల్స్‌కు మంచి అవకాశం. ముంబైని ఓడించడమే కాకుండా భారీ విజయం సాధించి పాయింట్స్ టేబుల్‌లో మెరుగైన స్థానంలో నిలిచే అవకాశం ఆ జట్టుకు కలుగుతోంది. వీటన్నిటిని గమనించి.. ముంబై పై ఆర్‌సీబీ అభిమానులు రగిలిపోతున్నారు. ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరవద్దనే కసితోనే ఆ జట్టు ఇలా చేస్తుందని కామెంట్ చేస్తున్నారు.