Begin typing your search above and press return to search.
నగరిలో వైఎస్ ఆర్ క్యాంటీన్లు:రోజా
By: Tupaki Desk | 24 July 2018 11:37 AM GMTఏపీ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం`అన్న` క్యాంటీన్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, అంతకు రెండు నెలల ముందే వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణరెడ్డి మంగళగిరిలో `రాజన్న క్యాంటీన్లు` ప్రారంభించారు. `రాజన్న` క్యాంటీన్ లో ప్రతి ఒక్కరికి రూ.4 రూపాయలకే పూర్తి భోజనం అందించే బృహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా సంచలన ప్రకటన చేశారు. త్వరలో నగరి నియోజకవర్గం వ్యాప్తంగా వైఎస్ ఆర్ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. ఆకలితో అలమటించే వారి కడుపు నింపాలనే సదుద్దేశ్యంతో ఆ క్యాంటీన్లను తాను సొంతంగా ఏర్పాటు చేయబోతున్నానని రోజా తెలిపారు. అభివృద్ధి పనుల కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు టీడీపీ సర్కార్ ఒక్క రూపాయి మంజూరు చేయలేదని అన్నారు. అందుకోసం - తానే తన సొంత డబ్బుతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని అన్నారు. గతంలో కూడా నగరి ప్రభుత్వాస్పత్రిలో - హాస్టళ్ళలో - బాలికల జూనియర్ కాలేజీలో ఆర్ వో ప్లాంట్లు - కూలర్లు ఏర్పాటు చేశానని అన్నారు. దాంతోపాటు, 10 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు కూడా అందచేశానని అన్నారు.
కాగా, మంగళగిరిలో రెండు నెలల నుంచే `రాజన్న` క్యాంటీన్లను స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి నడుపుతున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో కేవలం 4 రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. రాజన్న క్యాంటీన్ లో వారం పొడువునా అన్నం - కూర - పప్పు - చిప్స్ అందిస్తారు. నాలుగు రోజుల పాటు గుడ్డు ఇస్తారు .... మిగతా మూడు రోజులు గుడ్డు బదులు...అరటి పండు ఇస్తారు. నిరుపేదలు కూడా మూడు పూటలా కడుపు నిండా నాణ్యమైన భోజనం చేయాలనే సేవా దృక్పథంతో ఈ క్యాంటీన్ ప్రారంభించామని ఆర్కే గతంలో చెప్పారు. త్వరలోనే `రాజన్న` క్యాంటీన్ టిఫిన్ సెక్షన్ కూడా మొదలు పెడతానని ఆర్కే అన్నారు. రాజన్న క్యాంటీన్ కు ప్రజలనుంచి విపరీతమైన ఆదరణ వస్తోంది.