Begin typing your search above and press return to search.

నవనిర్మాణ దీక్షలో రోజా

By:  Tupaki Desk   |   6 Jun 2016 11:27 AM GMT
నవనిర్మాణ దీక్షలో రోజా
X
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీకి తీరని అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ... ఏపీ పునర్నిర్మాణానికి అంకితమవుతూ చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన నవనిర్మాణ దీక్ష ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ అది టీడీపీ కార్యక్రమంగానే ముద్రపడింది. ప్రజలందరూ అందులో భాగస్వాములు కావాలని చంద్రబాబు పదేపదే పిలుపునిస్తున్నా కార్యక్రమం మాత్రం టీడీపీ కార్యక్రమంగానే సాగుతోంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఆ ఛాయలకే రాకుండా తీవ్రంగా విమర్శిస్తోంది. కానీ... విచిత్రంగా వైసీపీ ఎమ్మెల్యే - ఫైర్ బ్రాండ్.. టీడీపీ - చంద్రబాబు పేరు వినిపస్తేనే ఇంతెత్తున ఎగిరిపడే రోజా నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే.. అక్కడా ఆమె చంద్రబాబును - టీడీపీని విమర్శించినప్పటికీ ఆమె నవనిర్మాణ దీక్షలో పాల్గొనడం మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది.

తిరుపతిలోని విజయపురంలో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ రోజు పాల్గొన్నారు. దాంతో అక్కడున్న టీడీపీ నేతలంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే.. అంతలోనే తేరుకుని ఆమెను వేదికపైకి ఆహ్వానించారు. దీంతో నవనిర్మాణ దీక్షలో రోజా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ కార్యక్రమం అయిన నవనిర్మాణదీక్షకు స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడం దారుణమని, అవి చంద్రబాబు భజన కార్యక్రమాలుగా మారిపోయాయని విమర్శించారు. తన నియోజక వర్గంలో జరుగుతోన్న నవ నిర్మాణ దీక్షకు ఎమ్మెల్యేనైన తనను ఆహ్వానించలేదని.. అయినా వచ్చానని చెప్పుకొచ్చారు. ఆహ్వానం లేకపోయినప్పటికీ ఎమ్మెల్యే హోదాలో వచ్చానని చెబుతూనే నవనిర్మాణ దీక్ష ఉద్దేశాలను పక్కన పెట్టి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. గతంలో ఒక్క హైదరాబాద్ పైనే చంద్రబాబు దృష్టి పెట్టారని, ఇప్పుడేమో అమరావతి నామస్మరణ చేస్తున్నారని... అధికార వికేంద్రీకరణ జరిగితేనే సాధ్యమని రోజా అన్నారు. గడచిన రెండేళ్లలో టీడీపీ ప్రభుత్వం సాధించింది ఏమీలేదని విమర్శించారు. అప్పట్లో హైదరాబాద్ ను పట్టుకుని మిగతా రాష్ట్రాన్ని వదిలేసినట్లుగా ఇప్పుడు అమరావతిని పట్టుకుని మిగతా రాష్ట్రాన్ని మరిచిపోతున్నారని చురకలు వేశారు.

అయితే.. విపక్ష నేతగా రోజా నవనిర్మాణ దీక్షలో పాల్గొనడంతో టీడీపీ నేతలెవరూ ఆమె విమర్శలను పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. తమను తీవ్రంగా విమర్శిస్తున్న వైసీపీ నుంచి రోజా హాజరవడం మంచి పరిణామమే అన్నట్లుగా హుందాగా స్వీకరించారు. మొత్తానికి నవనిర్మాణ దీక్ష పిలుపు వైసీపీ అధినేత జగన్ ను కదిలించలేకపోయినా రోజాను కదిలించడమైనా సంతోషకరమేనని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మరి... రోజా జగనన్నకు చెప్పే వచ్చిందో లేదంటే తనకు తానుగా వచ్చిందో తెలియాలి.