Begin typing your search above and press return to search.

నీ కొడుక్కి ఉద్యోగం ఇప్పించుకుంటే స‌రిపోతుందా?

By:  Tupaki Desk   |   26 Aug 2017 5:39 PM GMT
నీ కొడుక్కి ఉద్యోగం ఇప్పించుకుంటే స‌రిపోతుందా?
X
ఉన్న‌ది ఉన్న‌ట్లుగా.. సుత్తి కొట్ట‌కుండా సూటిగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరును క‌డిగిపారేసే అతికొద్ది మంది నేత‌ల్లో ఏపీ విప‌క్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ క‌మ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఒక‌రు. చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లకు ఆమె త‌ర్వాతే ఎవ‌రైనా. తెలుగు త‌మ్ముళ్ల‌కు మంట పుట్టేలా మాట్లాడ‌టంలో పెట్టింది పేరైన రోజా మాట్లాడుతున్నారంటే చాలు.. తెలుగు త‌మ్ముళ్లు అలెర్ట్ అయిపోతుంటారు.

ఎందుకంటే ఆమె చేసే ఆరోప‌ణ‌ల తీవ్ర‌త‌కు.. విమ‌ర్శ‌ల పంచ్ ల‌కు ఒక‌రిద్ద‌రు స‌రిపోరు మ‌రి. తాజాగా ఆమె మ‌రోసారి త‌న గొంతు విప్పారు. చంద్ర‌బాబు తీరును త‌న‌దైన శైలిలో క‌డిగి పారేశారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి వ‌చ్చిన ఆమె.. తాజాగా రెండు వార్డుల్లో (31 - 32) ప‌ర్య‌టించారు. ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు.

స‌ద‌రురెండు వార్డుల్లో ప్ర‌తిఇంటికి వెళ్లి.. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల్ని గెలిపించాల్సిందిగా ఆమె కోరారు. అనంత‌రం బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు.ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మీద నిప్పులు చెరిగారు. ఎవ‌రు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో.. వాళ్లే కాకినాడ ఓట‌ర్లు అంటూ ఉత్సాహ‌ప‌రిచిన ఆమె.. బాబు పాల‌నకు తీర్పు చెప్పేలా కాకినాడ ఓట‌ర్లు ఓట్లు వేయాల‌ని పిలుపునిచ్చారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో బాబు వ‌స్తే జాబు గ్యారెంటీ అంటూ ఉద‌ర‌గొట్టిన చంద్ర‌బాబు.. ఏపీలోని ల‌క్ష‌లాది మంది యువ‌త‌కు ఉద్యోగాలు ఇవ్వ‌లేని చంద్ర‌బాబు.. త‌న కొడుక్కి మాత్రం మంత్రిప‌ద‌వి ఇచ్చి ఉద్యోగం ఇప్పించుకున్నార‌న్నారు. బుద్ధిలేని కొడుక్కి ఉద్యోగాన్ని ఇప్పించుకున్న చంద్ర‌బాబు.. రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు ఏం స‌మాధానం ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. త‌న సూటి మాట‌ల‌తో హుషారెక్కించిన రోజా మాట‌ల‌కు కాకినాడ త‌మ్ముళ్ల గుండెల్లో ద‌డ మొద‌లైంద‌న్న మాట వినిపిస్తోంది.