Begin typing your search above and press return to search.

రోజా ప్ర‌శ్న‌!... ప‌వ‌నూ ఈ బ్ల‌ఫ్పింగేమిటి?

By:  Tupaki Desk   |   1 Aug 2017 12:15 PM GMT
రోజా ప్ర‌శ్న‌!... ప‌వ‌నూ ఈ బ్ల‌ఫ్పింగేమిటి?
X
శ్రీ‌కాకుళం జిల్లా ఉద్దానం వాసుల‌ను ప‌ట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధుల‌ను దూరం చేసేందుకు జ‌రుగుతున్న చ‌ర్య‌ల‌పై టాలీవుడ్ స్టార్ హీరో, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మొన్న‌, నిన్న చేసిన కామెంట్ల‌పై ఏపీలో విప‌క్షం వైసీపీ ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఉద్దానం లాంటి స‌మ‌స్య‌లే కాకుండా రాష్ట్రంలోని ఎక్క‌డ‌, ఏ స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైనా... దానిని ప‌రిష్క‌రించేందుకు సాగించే పోరు విష‌యంలో తాము ముందు వ‌రుస‌లో ఉంటామ‌ని చెప్ప‌డంతోనే స‌రిపెట్ట‌ని ఆ పార్టీ నేత‌లు... ఈ త‌ర‌హా విష‌యాల్లో ఎవ‌రికైనా మ‌ద్ద‌తిచ్చే విష‌యంలో తామెమీ వెనుకాడ‌బోమ‌ని కూడా చెబుతున్నారు. అయితే ఉద్దానం స‌మ‌స్య ప‌రిష్కారం దిశ‌గా ఇప్పుడు జ‌రుగుతున్న చ‌ర్య‌లు తానొక్క‌డి ఉద్య‌మం వ‌ల్ల‌నేనంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ఆ పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అంతేకాకుండా ఉద్దానం స‌మ‌స్య‌ను గ‌త ప్ర‌భుత్వాల‌పైకి నెడుతూ ప‌వ‌న్ చేసిన ఆరోప‌ణ‌ల‌పైనా వైసీపీ తీవ్రంగా స్పందించింది.

ఈ మేర‌కు నేటి ఉద‌యం మీడియా ముందుకు వ‌చ్చిన వైసీపీ ఫైర్ బ్రాండ్‌ - చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా... ఉద్దానం స‌మ‌స్య‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు రోజులుగా చేసిన ప్ర‌హ‌స‌నంపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. కిడ్నీ బాధితుల‌కు ఊర‌ట క‌లిగించే చ‌ర్య‌లు చేప‌ట్టే ప్ర‌తి ఒక్క‌రికీ త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని, ఈ విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కూడా తాము మ‌ద్ద‌తు ప‌లికే విష‌యంలో ఎలాంటి భేష‌జాల‌కు పోమ‌ని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఉద్దానం స‌మ‌స్య ప‌రిష్కారం కోసం జ‌గ‌న్ మ‌ద్ద‌తు కూడా అడుగుతానంటూ ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పైనా స్పందించిన ఆమె... తాము కూడా ప‌వన్ పోరుకు మ‌ద్ద‌తు ప‌లికేందుకు సిద్ధంగానే ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. అయితే గ‌త ప్ర‌భుత్వాల వైఖ‌రి వ‌ల్లే ఉద్దానం స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైన‌ట్లుగా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై రోజా ఘాటుగా స్పందించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌గా, 2004లోనే నాడు సీఎంగా ఉన్న దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఈ స‌మ‌స్య మూలాల‌ను తెలుసుకునేందుకు ప‌రిశోధ‌న జ‌ర‌పాల‌ని ఆదేశాలు జారీ చేశార‌న్న విష‌యాన్ని ఆమె గుర్తు చేశారు. విశాఖ కేజీహెచ్ వైద్యుల బృందంతో వైఎస్ ఆర్ ఆ స‌మ‌స్య‌పై ప‌రిశోధ‌న చేయించార‌ని రోజా చెప్పారు. ఇక కేజీహెచ్‌కే చెందిన ఓ స్పెష‌లిస్ట్ వైద్యుడిని 2007లో శాన్‌ ఫ్రాన్సిస్కోలో జ‌రిగిన ఓ అంత‌ర్జాతీయ స‌మావేశానికి కూడా పంపించిన విష‌యాన్ని ప‌వ‌న్ మ‌రిచిపోయార‌ని కూడా రోజా ఎద్దేవా చేశారు. ఉద్దానం స‌మ‌స్య తానొక్క‌డి పోరు కార‌ణంగానే తెర‌పైకి వ‌చ్చింద‌న్న చందంగా ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆరోపించిన రోజా... అధికార టీడీపీకి మైలేజీ ఇచ్చేందుకే ప‌వ‌న్ ఈ త‌ర‌హా కామెంట్లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అయినా ఉద్దానం స‌మ‌స్య ప‌రిష్కారం కోసం టీడీపీ స‌ర్కారు చేస్తున్న చ‌ర్య‌లు నామ‌మాత్రంగానే ఉన్నాయ‌ని, ఈ పాటి దానికే ప‌వ‌న్ అంత‌గా రియాక్ట్ కావాలా? అని కూడా రోజా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.