Begin typing your search above and press return to search.

వైసీపీ కార్యకర్తల పై కేసు పెట్టిన నగరి ఎమ్మెల్యే రోజా ..ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   6 Jan 2020 6:15 AM GMT
వైసీపీ కార్యకర్తల పై కేసు పెట్టిన నగరి ఎమ్మెల్యే రోజా ..ఎందుకంటే ?
X
ఏపీఐఐసీ చైర్మన్, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా పై దాడి యత్నం తీవ్ర ఉగ్రరూపం దాల్చేలా కనిపిస్తుంది. ఈ వ్యవహారం సొంత పార్టీ కార్యకర్తలపైనే ఎమ్మెల్యే రోజా కేసులు పెట్టే వరకు వెళ్లింది. ఈ మేరకు పుత్తూరు పోలీస్ స్టేషన్‌ లో పలువురు వైసీపీ కార్యకర్తల పై కేసు నమోదైంది. కేబీఆర్ పురంలో తన కారు పై దాడి చేశారని రోజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు.. వైసీపీ కార్యకర్తల పై కేసు నమోదు చేశారు. హరీష్, సంపత్, సురేష్, రిషేంద్ర, అంబు, సరళ, రామ్మూర్తి పై 143, 341, 427, 506, 509, 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు బుక్ చేశారు. కేబీఆర్ పురంలో సచివాలయ భూమి పూజకు వెళ్తున్న సమయంలో దాడి చేశారని రోజా కంప్లయింట్ ఇచ్చారు.

పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే రోజా జనవరి 5న నగరి నియోజవర్గంలోని పుత్తూరు మండలంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో కేబీఆర్ పురం గ్రామంలోకి ప్రవేశించకుండా..ఒక వర్గం వైసీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. సుమారు 20 నిమిషాల పాటు ఆమె కారును ముందుకు కదలనివ్వలేదు. రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామ సచివాలయ కార్యక్రమానికి తమను పిలవకపోవడాన్ని తప్పుపట్టారు. కారు అద్దాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అలాగే రోజా కారులో నుండే వారికీ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, వైసీపీ కార్యకర్తలు ఆమె మాట వినకుండా మరింత పెద్దగా ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళలనకారులను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.

కాగా , తాను కారులో ఉండగా.. అమ్ములు వర్గీయులు కారు పై దాడికి ప్రయత్నించారని రోజా ఆరోపించారు. గత ఎన్నికల్లో అమ్ములు వర్గం తనకు వ్యతిరేకంగా పని చేసిందని రోజా చెబుతున్నారు. తన పై అమ్ములు వర్గం దాడికి ప్రయత్నించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానన్నారు. అమ్ములు వర్గం మరోలా చెప్తుంది. ఎమ్మెల్యే రోజా పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలకు కాకుండా, టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని అమ్ములు వర్గం ఆరోపిస్తోంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కనీసం తమను పట్టించుకోలేదని, కనీసం పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. మొత్తంగా సొంత పార్టీ కార్యకర్తలపైనే ఎమ్మెల్యే కేసు పెట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారిపోయింది.