Begin typing your search above and press return to search.

సింహం సింగిల్ గా వస్తుంది. ఇంతకు మించిన పులిసిన పులిహోర మాట మరొకటి లేదట

By:  Tupaki Desk   |   9 Jan 2023 3:30 PM GMT
సింహం సింగిల్ గా వస్తుంది. ఇంతకు మించిన పులిసిన పులిహోర మాట మరొకటి లేదట
X
రీల్ డైలాగులు కొన్ని విన్నంతనే బాగున్నట్లుగా అనిపించినా.. కాస్తంత లోతుకు వెళ్లి చూసినా.. లాజిక్ ను అప్లై చేసినా.. వాటిల్లో డొల్లతనం ఇట్టే కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఏపీ రాజకీయాల్ని చూసినప్పుడు.. అధికారపార్టీకి చెందిన నేతలు పలువురు తమ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేస్తుంటారు. అదే సమయంలో తమ రాజకీయ ప్రత్యర్థుల్ని చిన్నబుచ్చేలా మాట్లాడటం..వారు చేసే పనిగా చులకనకు గురి చేస్తూ.. వారి మీద వారికి అయోమయాన్ని క్రియేట్ చేసే ఎత్తుగడను ఫాలో అవుతుంటారు. ఈ సందర్భంగా అధినేతను ఆకాశానికి ఎత్తేసేందుకు.. ఆయన మనసును దోచుకునేందుకు మంత్రులు పలువురు అదే పనిగా ప్రయత్నిస్తుండటం చూస్తూనే ఉంటాం.

ఇక్కడ జగన్ మనస్తత్వానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్నిప్రస్తావించాలి. తనను ప్రసన్నం చేసుకోవటానికి.. మనసు దోచుకోవటానికి తెగ ప్రయత్నించే వారికి ఎలాంటి పదవులు ఇవ్వకుండా కొంతకాలం పరీక్షించటం అలవాటు. సదరునేతలు కోరుకున్నట్లుగా తాను స్పందించని సమయంలో వారి రియాక్షన్ ఎలా ఉంటుందన్న శీల పరీక్ష ఆయన తరచూ చేస్తుంటారు. ఇందులో సక్సెస్ అయ్యే వారికి పదవులు తర్వాత రావటం.. ఫెయల్ అయిన వారిని పక్కన పెట్టేయటం చేస్తుంటారు.

నిజానికి ఇలాంటి పరీక్షలు పెట్టటానిక ఇతర పార్టీ అధినేతలు సాహసించరు. కానీ.. వారికి భిన్నమైన మైండ్ జగన్ ది కావటంతో ఆయన అలాంటివి చేస్తుంటారు. తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించిన సమయంలో తాను తొలి దఫా మొండిచేయి చూపించినా.. తట్టుకొని నిలబడిన పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాకు మంత్రి పదవి ఇవ్వటం తెలిసిందే. జగన్ ముఖ్యమంత్రి కావటానికి ముందు నుంచి.. ఆ మాటకు వస్తే ఆయన రాజకీయంగా గడ్డు పరిస్థితుల్లో ఉన్న కాలంలో ఆయన తరఫున వకల్తా పుచ్చుకొని మాట్లాడటం.. నోటికి అదే పనిగా పని చెప్పే రోజాకు మంత్రి పదవి ఇవ్వటం ద్వారా ఆమె సుదీర్ఘ నిరీక్షణకు తెర దించారనే చెప్పాలి.

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా తనలోని కమిట్ మెంట్ ఇసుమంత కూడా తగ్గలేదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఆమె నోటికి పని చెప్పటం చూస్తున్నదే. ఎంత కమ్మటి వంటకమైనా అదే పనిగా తింటూ ఉంటే.. ఏదో ఒక రోజుకు ముఖం మొత్తే మాటకు తగ్గట్లే రోజమ్మ మాటలు.. ఆమె ఫైర్ బ్రాండ్ వ్యాఖ్యలు ఇప్పుడు రివర్సు కొడుతున్నాయి. అదే పనిగా వాడేసే ఆమె మాటల్లో ఒకటి సింహం సింగిల్ గా వస్తుందని. జగన్ ఏమీ జంతువు కాదు కదా? కానీ.. ఆయన్ను సింహంగా పోల్చటానికి.. తానుఅదే పనిగా తప్పు పట్టే పార్టీకి చెందిన ముఖ్యనేతకు చెందిన సినిమాలోని డైలాగ్ ను వాడేయటానికి అస్సలు మొమహాట పడని ఆమె మాటలు ఇప్పుడు రివర్సు అవుతున్నాయి.

సింహం సింగిల్ గా వస్తుందన్న పాత చింతకాయ తరహా నాటు పోలికకు కాస్తంత లాజిక్ జోడించి చూద్దాం. పురాణాల్లోకి కాస్త వెళదాం. నరకాసురుడు లాంటి రాక్షసుడ్ని వధించటానికి శ్రీక్రిష్ణుడు లాంటి వాడికి కూడా చేతకాక.. తన శ్రీమతి సత్యభామ సాయాన్ని తీసుకున్నాడు. మరి.. శ్రీక్రిష్ణుడు మరీ అంత పనికిమాలిన వాడిగా భావిద్దామా? శ్రీరామ చంద్రుడ్నే తీసుకుంటే.. రావణ సంహారానికి ఆయన హనుమంతుడితో పాటు వానర సేన సాయం తీసుకోవటం ఏమిటి? శ్రీరాముడు సింగిల్ గా సింహం మాదిరి రావణుడి మీద లఘించలేరా? ఇలా చూస్తే పురాణాల్లో రాక్షస సంహారానికి కొన్ని కలయికలు జరగాల్సి ఉంటుంది. ఎందుకలా అంటే.. రాక్షస సంహారం అన్నది చుట్టూ ఉన్న వారికి ఎంత హాని చేస్తుందన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. అందరూ ఎంతలా విసిగిపోయారన్న విషయాన్ని స్పష్టం చేస్తుందన్నది చెప్పక తప్పదు.

రెండు పార్టీల మధ్య పొత్తును పెద్ద బూతులాగా వక్కాణించే రోజమ్మ మర్చిపోయిన అంశాలు మరికొన్ని ఉన్నాయి. జగన్ పార్టీ పెట్టింది తన సొంత బలంతో కాదన్నది మరచిపోకూడదు. తన తండ్రి రాజన్నకు ఉన్న ఛరిష్మాతో పాటు.. ఆయన ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతల్ని తన వెంట పెట్టుకోవటమే కాదు.. ఏపీలో కులాల మధ్య దూరాల్ని పెంచేయటంతో పాటు.. పక్క రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రితో తెర వెనుక మంతనాలతోనే విజయాన్ని సాధించారన్న అందరికి తెలిసిన నిజం ఎవరికీ తెలీదన్నట్లుగా మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంటుందన్న మాట రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.

చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ఇద్దరు మూడో కంటికి కనిపించకుండా.. చీకటి ఒప్పందాలు ఏమీ చేసుకోవటం లేదే? ఓపెన్ గా ఉన్న విషయాన్ని ఉన్నట్లు చెబుతున్నారు. పురాణాల్లో రాక్షస సంహారం చేయాల్సి వచ్చినప్పుడు అన్ని శక్తులు ఏకం కావటంతో పాటు పాటు.. ప్రక్రతి కూడా వారికి అండగా నిలుస్తుంది. అంతమాత్రాన వారు చేతకాని వారు కాదని.. చేవలేని వారు కాదని కాదు. ఇక్కడ చంద్రబాబు ఎక్కువ.. పవన్ తక్కువ అన్న వాదనను తేవటం కూడా వ్యూహంలో భాగమే అన్నది మర్చిపోకూడదు.

ఎందుకంటే.. ఈ ఇద్దరు అధినేతల్లో అలాంటి భావన లేదన్న విషయాన్ని వారికి సన్నిహితంగా ఉన్న వారు బాహాటంగా చెబుతున్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్న వేళ.. కన్ను కుట్టి.. ఇదే బంధం కొనసాగితే.. తమ పుట్టి ఎక్కడ మునిగిపోతుందన్న ఆందోళనతో చేసే వితండానికి నిదర్శనమే సింహం సింగిల్ గా వస్తుందన్న మాటలుగా చూడాలి. ఈ తరహా కాలం చెల్లిన పోలికలతో రోజాకు కలిగే ప్రయోజనం కంటే కూడా.. జగన్ కు జరిగే నష్టమే ఎక్కువన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ వాస్తవాన్ని రోజా గుర్తించే పరిస్థితి ఉందంటారా?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.