Begin typing your search above and press return to search.

రోజా మాట‌!..అఖిలా ఈ విష‌యాలు తెలుసుకో!

By:  Tupaki Desk   |   4 Aug 2017 1:26 PM GMT
రోజా మాట‌!..అఖిలా ఈ విష‌యాలు తెలుసుకో!
X
క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీకి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక సంద‌ర్భంగా ఇప్పుడు ఏపీలో రాజకీయం మ‌రింత‌గా వేడెక్కింది. నిన్న‌టిదాకా ఓ మాదిరిగా ప్ర‌చారం సాగినా... నిన్న నంద్యాల‌లో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌తో రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింద‌నే చెప్పాలి. ఫిరాయింపు రాజ‌కీయాల‌కు తాము దూర‌మ‌ని - స‌చ్ఛీల రాజ‌కీయాలే త‌మకు మార్గ‌మ‌ని చాటి చెప్పిన జ‌గ‌న్‌... టీడీపీ నుంచి త‌న పార్టీలోకి వ‌చ్చేసిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డితో ఎమ్మెల్సీ ప‌ద‌వికి ప్ర‌జా స‌మ‌క్షంలో రాజీనామా చేయించారు. దీంతో షాక్ తిన్న టీడీపీ అస‌లు జ‌గ‌న్‌ పై గానీ - చ‌క్ర‌పాణిరెడ్డిపై గానీ సింగిల్ ఆరోప‌ణ కూడా చేయ‌లేని డైల‌మాలో ప‌డిపోయింది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబును న‌డిరోడ్డుపై కాల్చి చంపినా త‌ప్పులేద‌ని జ‌గ‌న్ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య‌ను ప‌ట్టుకుని రాద్ధాంతం చేస్తున్న టీడీపీ శ్రేణుల‌పై వైసీపీ ఫైర్ బ్రాండ్‌ - చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

నంద్యాల వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డి నామినేష‌న్ కోసం నంద్యాల‌లోనే ఉన్న రోజా... నేటి మ‌ధ్యాహ్నం మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ టీడీపీ నేత‌ల‌పై దుమ్మెత్తిపోశారు. అదే స‌మ‌యంలో త‌మ పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచి ఆపై టీడీపీలో చేరి, ఇప్పుడు మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన భూమా అఖిల‌ప్రియ చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను టార్గెట్ చేసిన రోజా... *అఖిలా ఈ విష‌యాలు తెలుసుకో* అంటూ సెటైరిక్ ప్ర‌శ్న‌లు సంధించి అటు టీడీపీ నేత‌ల‌తో అయోమ‌యంలో ప‌డేశారు. అదే స‌మ‌యంలో టీడీపీ నేత‌ల వైఖ‌రి ఏమిటో ప్ర‌జ‌ల‌కు తెలియ‌జెప్పేందుకు రోజా చేసిన య‌త్నం మంచి ఫ‌లితాన్నే ఇచ్చింద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఈ సంద‌ర్భంగా అఖిల‌ప్రియ‌కు రోజా తెలియ‌జెప్పిన అంశాల‌ను ఓ సారి ప‌రిశీలిస్తే...

* త‌న‌కు ఎదురు నిలిచిన వారు బ్ర‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌లేద‌ని చంద్రబాబు హెచ్చరించిన మరుసటి రోజే వైయస్ రాజశేఖర రెడ్డి ప్రాణాలు గాలిలో కలిశాయని రోజా అన్నారు. అలాగే చాలాసార్లు జగన్‌ ను ముఖ్యమంత్రి హెచ్చరించారని చెప్పారు. తనతో పెట్టుకున్న వారు ఎవరూ బతికి బట్ట కట్టలేదని చంద్రబాబు అన్నారని ఆమె అగ్రహించారు.

* మంత్రి అఖిలప్రియ ఇష్టారీతిన మాట్లాడుతోందని రోజా మండిపడ్డారు. శోభా నాగిరెడ్డిని వైసీపీ మొత్తం గౌరవిస్తోందని, కానీ మీరు ఆమె ఆశయాలకు ఎందుకు తూట్లు పొడిచారని ప్రశ్నించారు. శోభా పీఆర్పీ నుంచి వచ్చినప్పుడు రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరారని చెప్పారు. ఇప్పుడు తల్లి ఆశయాలను అఖిల‌ తుంగలో తొక్కారన్నారు.

* భూమా కుటుంబానికి మూడు టిక్కెట్లు ఇచ్చిన ఘనత జగన్‌ దే అని రోజా అన్నారు. శోభా మృతి తర్వాత జగన్ కుటుంబం భూమా కుటుంబానికి అండగా ఉందని చెప్పారు. మీ అమ్మ, నాన్న ఆశయాలను నీవు తుంగలో తొక్కుతున్నావని అఖిలపై మండిపడ్డారు.

* అఖిల‌ తండ్రి భూమా నాగిరెడ్డి చావుకు చంద్రబాబు కారణమని రోజా ఆరోపించారు. చేయని తప్పుకు భూమా నాగిరెడ్డిని 14 రోజులు ఈ ప్రభుత్వం జైల్లో పెట్టిందన్నారు. రౌడీషీట్ తెరిచిందన్నారు.