Begin typing your search above and press return to search.

బాబు రెట్టింపు చెడ్డ‌పేరు ఎలా తెచ్చుకున్నాడో చెప్తున్న రోజా

By:  Tupaki Desk   |   20 April 2018 3:30 PM GMT
బాబు రెట్టింపు చెడ్డ‌పేరు ఎలా తెచ్చుకున్నాడో చెప్తున్న రోజా
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కంటే...త‌న రాజ‌కీయ అవ‌స‌రాలకే పెద్ద పీట వేస్తున్నార‌ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా ఆక్షేపించారు. టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కరోజు దీక్షపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విభజన చట్టం హామీలు అమలు - హోదా కోసం గానీ ఏ విధమైన దీక్షలు - పోరాటాలు చేయకుండా చంద్రబాబు ఎంత చెడ్డపేరు తెచ్చుకున్నారో - దొంగ దీక్ష - దగా దీక్ష ద్వారా రోజు అంతకంటే డబుల్ గా చంద్రబాబు చెడ్డపేరును మూట గట్టుకున్నారని మండిపడ్డారు. ఎంపిలు పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడిన తరువాత స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామాలు ఇచ్చి - ప్రజల కోసం ఆమరణ దీక్షకు కూర్చుంటే - వారిని బలవంతంగా ఆసుపత్రికి తరలించిననాడే దీక్షలు చేయాల్సిన వాళ్లు15 రోజుల తరువాత చేయడం రాజకీయలబ్ధి - ఎన్నికల స్టంట్ కోసం తప్ప మరోటి కాదని రోజా స్ప‌ష్టం చేశారు.

హోదా కోసం వైఎస్సార్‌ సీపీ ఎంపీలు... స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు కూర్చుంటే బలవంతంగా ఈ ప్రభుత్వాలు దీక్షను భగ్నం చేశాయని ఎమ్మెల్యే రోజా గుర్తు చేశారు. టీడీపీ ఎంపిలు ఆ రోజే రాజీనామాలు చేసి దీక్ష చేసి ఉంటే, ఈ రోజు చేస్తున్నదొంగ దీక్షను - చిత్తశుద్ధితో ఢిల్లీలో చేసి ఉంటే కేంద్రంపై వత్తిడి పెరిగేదన్నారు. జాతీయ స్థాయిలో చర్చ జరిగి - హోదా వచ్చి ఉండేదని రోజా పేర్కొన్నారు. టీడీపీ వాళ్లు రాజీనామా చేయకుండా - పార్లమెంటు లోపలా - స్పీకర్ లేని సమయంలో స్పీకర్ కార్యాలయంలో దీక్షల పేరిట డ్రామాలు ఆడారు. ఇక్కడ ఇప్పుడు సైకిల్ ర్యాలీలు చేస్తూ - బ్రేక్ ఫాస్ట్ చేసి వచ్చి 12 గంటల దీక్షలంటూ - దీక్షలను దిగజారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఆమరణ నిరాహార దీక్ష అంటే తిండి తినకుండా - ప్రాణాలు వదులుకోడానికి పోయేంత వరకు చేసేవని చంద్రబాబు తెలుసుకోవాలని వ్యంగ్యంగా అన్నారు. 12గంటల పాటు చేసే వాటిని ధర్మదీక్ష అనరు - ఉపవాసం అంటారని గుర్తు చేశారు. కేవలం ఉపవాసంతో కూర్చున్న చంద్రబాబే నిరాహార దీక్ష అని అరుస్తూ - గొప్పగా ప్రచారం చేసుకుంటూ మాట్లాడితే, ప్రాణాలను పణం పెట్టిన వారిని ప్రజలు ఏ విధంగా అక్కున చేర్చుకోవాలో చెప్పాలన్నారు. ``నువ్వు తినే పుల్కాలు - పళ్ల కోసం 2 - 3 వందలు కావాలి కానీ - ఖజానా 8 కోట్లు డ్రా చేసుకుంటే ఏమనాలి? 12 గంటల దీక్షలు 30 కోట్లు ఖర్చు చేయడాన్ని ఏమనాలి` అంటూ చంద్రబాబు తీరుని సూటిగా ప్రశ్నించారు.

చంద్రబాబు దీక్షను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని రోజా తెలిపారు. `ఒక పక్క డాన్సులు - మరోపక్క ప్రభుత్వ కార్యక్రమని చెప్పి - దానిపై అవగాహన లేని క్రీడాకారులను వాళ్లను పిలుపించుకుని భజన చేయించుకుంటున్నారు. స్టేజిమీద ఎంటర్ టైన్ మెంట్ కోసం ఎన్టీఆర్ డూప్ ను పెట్టుకుని పగలబడి నవ్వుతుంటే ఎన్టీఆర్ వంటి గొప్ప నాయకుడి ఆత్మ క్షోభిస్తోంది. చంద్రబాబు చేస్తున్నది చూస్తుంటే ఆయనకు అత్యవసరంగా ట్రీట్‌ మెంట్ అవసరం అని తెలుస్తోంద‌ని రోజా అన్నారు. `ఆయన జబ్బు ముదిరిపోయింది. హత్య చేసిన వ్యక్తి న్యాయమూర్తి ముందర హత్యను ఖండిస్తున్నానని చెప్పినట్లుగా, హోదాను చంపేసిన చంద్రబాబే , ఈరోజు దీక్ష చేసినట్లుగా ఉంది. ఆయనను ఇలానే వదిలేస్తే, రుణమాఫీ దీక్ష, నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వలేదని దీక్ష - నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఒక దీక్ష - 600 హామీలు అమలు కాలేదని 600 హామీలు కలెక్టరేట్ల ముందు - సెక్రటేరియట ముందు దీక్షలు చేసిన ఆశ్చర్యం లేదు.` అని రోజా ఎద్దేవా చేశారు. 5 కోట్ల మంది జీవితాలకు సంబంధించిన వ్యవహారాలు చూడాల్సిన వారి మానసిక పరిస్థితి సరిగా లేకపోతే - వెంటనే సెట్ చేయాలి అని రోజా వ్యాఖ్యానించారు.

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో ప్రవేశించినప్పుడు ప్రజలు ప్రవాహంలో వెల్లువై వచ్చి పలికిన స్వాగతం చూసిన చంద్రబాబుకు తన రాజకీయ జీవితం అంతం అయిపోయిందనే గుబులు పుట్టుకుందని రోజా అన్నారు. 13 జిల్లాల్లో జీరో అయిపోయాయని - తన అవినీతి అక్రమాలు ప్రజలకు తెలిసిపోయి, తాను జీరో అయిపోయాయన్న సంగతి నిర్ధారించుకుని , మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ దీక్షను చేపట్టారని స్పష్టం అవుతోందని ధ్వజమెత్తారు. `2016 సెప్టెంబరు 7 వ తేదీన ప్రత్యేక ప్యాకేజికి మద్దతు పలికి, హోదాకు సమాధి కట్టిన తన ఓటు కు నోటు కోసం నదులు, నిధులను తాకట్టు పెట్టి , తన మీద, తన కొడుకు అవినీతి విచారణ జరగకుండా, రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టి పూర్తిగా సాగిలపడిన చంద్రబాబు ఈ రోజు దీక్ష చేస్తుంటే ఎలా నమ్మాలి?

దీక్షల వల్ల ఏమొస్తుంది - ర్యాలీల వల్ల ఏమొస్తుందని చెప్పిన వ్యక్తి ఈ రోజు సైకిల్ ర్యాలీలు - దీక్షలు ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ చేస్తే ఏం లాభం ఢిల్లీలో చేయాలని అడిగిన చంద్రబాబూ మరి ఈరోజు ఇక్కడెందుకు చేస్తున్నారు. ఢిల్లీలో చేయవచ్చు కదా?` అని ప్ర‌శ్నించారు. విద్యార్ధులు - స్కూలు పిల్లలు గానీ ప్రత్యేక హోదా సభల్లో పాల్గొంటే, మిమ్మల్ని లోపలేస్తా అని బెదిరించిన చంద్రబాబు నాయుడు ఈ రోజు వారిని తన దొంగ,దగా దీక్షకు ఎలా విద్యార్ధులను ఎందుకు వాడుకుంటున్నారో చెప్పాలన్నారు.