Begin typing your search above and press return to search.

విశాఖ‌లో జ‌రిగింది ల‌క్ష ఎక‌రాల భూక‌బ్జా- రోజా

By:  Tupaki Desk   |   15 Jun 2017 8:15 AM GMT
విశాఖ‌లో జ‌రిగింది ల‌క్ష ఎక‌రాల భూక‌బ్జా- రోజా
X
విశాఖప‌ట్నం భూముల క‌బ్జా ఉదంతం ఏపీ స‌ర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌ల‌కు క‌బ్జాలో భాగ‌స్వామ్యం ఉంద‌న్న వాద‌న‌ల‌తో పాటు.. ఈ స్కాంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు.. ఆయ‌న కుమారుడు క‌మ్ మంత్రి లోకేశ్‌కు సైతం వాటా ఉంద‌న్న ఆరోప‌ణ‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి తీవ్ర ఆరోప‌ణ‌ల్నే సంధించారు ఏపీ విప‌క్ష ఫైర్ బ్రాండ్ రోజా.

విశాఖ భూక‌బ్జాల్లో సీఎం చంద్ర‌బాబు హ‌స్తం ఉంద‌న్న ఆమె.. అది ల‌క్ష ఎక‌రాల భూక‌బ్జా అని, దేశంలోనే అతి పెద్ద కుంభ‌కోణమ‌ని అభివ‌ర్ణించారు. ప్ర‌తిప‌క్షాలు.. మిత్ర‌ప‌క్షాలు.. మీడియా అంద‌రూ సీబీఐ విచార‌ణ‌కు కోరుతున్నా... బాబు మాత్రం ఎందుకు వేయ‌టం లేద‌న్న సూటిప్ర‌శ్న‌ను సంధించారు.

సిట్ అన్న‌ది కోర‌లు లేని పాములా మారింద‌ని.. విశాఖ భూక‌బ్జాపై త‌ప్ప‌నిస‌రిగా సీబీఐ విచార‌ణ సాగాల్సిందేన‌ని ఆమె డిమాండ్ చేశారు. విశాఖ భూముల్ని స్వాహా చేశార‌ని చెబుతున్న మంత్రి గంటా సైతం సీబీఐ విచార‌ణ‌ను కోరుతున్నార‌ని.. అయినా బాబు మాత్రం విచార‌ణ‌కు ఆదేశించ‌లేదు ఎందుక‌ని ప్ర‌శ్నించారు.

తెలంగాణ‌లో ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన భూక‌బ్జాల‌పై సీబీఐ విచార‌ణ‌కు డిమాండ్ చేస్తున్న టీడీపీ.. విశాఖ విష‌యంలో మాత్రం ఆ ప‌ని చేయ‌టం లేన్నారు. మ‌హానాడులో స‌వాలు విసిరిన లోకేశ్‌.. సీబీఐ విచార‌ణ‌పై మాత్రం నోరు మెద‌ప‌టం లేద‌ని మండిప‌డ్డారు. టీడీపీ నేత‌ల్ని త‌ప్పించుకునేందుకే సిట్ విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేశార‌న్నారు.

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి తాను ప‌వ‌ర్ లో ఉన్న‌ప్పుడు ఏదైనా ఆరోప‌ణ‌లు వ‌స్తే.. వెంట‌నే విచార‌ణ‌కు ఆదేశించేవార‌ని.. ఆ ద‌మ్ము.. ధైర్యం చంద్ర‌బాబుకు ఇప్పుడు లేద‌న్నారు. ఒక‌సారి కానీ ద‌ర్యాప్తు వేస్తే.. వారు జీవితాంతం జైల్లో ఉండాల్సి వ‌స్తుంద‌న్న విష‌యం చంద్ర‌బాబుకు బాగా తెలుసంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దొంగ‌లు దొంగ‌లు ఊళ్లు పంచుకున్న‌ట్లుగా చంద్ర‌బాబు.. లోకేశ్ లో విశాఖ భూముల్ని క‌బ్జా చేస్తున్నారంటూ మండి ప‌డ్డ రోజా.. హూదూద్ తుఫాను సంద‌ర్భంగా బాబు.. టీడీపీ నేత‌లు రాత్రిళ్లు విశాఖ‌లో తిరిగింది.. రికార్డులు మార్చ‌టానికేన‌న్న విష‌యం ఇప్పుడు అర్థ‌మ‌వుతుందంటూ భారీ ఆరోప‌ణ‌లు చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/