Begin typing your search above and press return to search.

బాబు ఏమైనా 'కాలభైరవుడా'..ఫైర్ అయిన రోజా!

By:  Tupaki Desk   |   12 Dec 2019 10:02 AM GMT
బాబు ఏమైనా కాలభైరవుడా..ఫైర్ అయిన రోజా!
X
రాజకీయాలు అన్నాక విమర్శలు - ఆరోపణలు సర్వ సాధారణం. కానీ , అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మాత్రం ..ఆ ఆరోపణలు - విమర్శలు మాత్రం కోటలు దాటుతుంటాయి. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. ఇక ఈ రోజు సభకి వస్తున్న సమయంలో మార్షల్స్‌ తమతో దురుసుగా ప్రవర్తించారని టీడీపీ నేతలు అసెంబ్లీ లో పెద్ద రాద్ధాంతం చేసారు. దీనిపై నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ ..టీడీపీ నేతలపై - టీడీపీ అధినేత చంద్రబాబు పై మండిపడ్డారు.

చంద్రబాబు మాటలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని - చంద్రబాబు హయాంలో కనీసం ప్రజా సమస్యలుపై మాట్లాడేందుకు మైక్‌ కూడా ఇవ్వలేదని - తాము నిరసన తెలుపుతుంటే ఆ వీడియోలు బయటకు చూపించలేదని - అసెంబ్లీ నుంచి తమను మార్షల్స్‌ తో బయటకు గెంటేశారని వివరించారు. గత అసెంబ్లీ వీడియోలు బయటపెడితే తమ పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో స్పష్టమవుతుందని తెలిపారు.

మొదటిసారి ఎమ్మెల్యే అయిన తనను అసెంబ్లీ నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఏడాదిపాటు సస్పెండ్‌ చేశారని, మహిళా ఎమ్మెల్యేపై కక్ష సాధింపు చర్యలు ఏమిటని సుప్రీంకోర్టు చెప్పినా బుద్ధి తెచ్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ కు సంబంధించి రెండు వంద లకు పైగా సీడీలు బయటపడటం.. వడ్డీకి డబ్బులు ఇచ్చి.. మహిళలను వ్యభిచార కూపంలోకి నెట్టుతున్న వైనాన్ని విజయవాడ సీపీ బయటపెట్టారని - దీనిలో టీడీపీకి చెందిన వాళ్ల ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఎంపీల ప్రమేయం ఉండటంతో దీనిమీద తాను వాయిదా తీర్మానం ఇచ్చానని - కానీ అసెంబ్లీలో దీనిపై చర్చించకుండా.. కామ సీఎం అన్నానని తనను ఏడాదిపాటు సస్పెండ్‌ చేశారని వివరించారు.

సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నా తనను అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వకుండా మార్షల్స్‌ అడుకున్నారని - తనకు అండగా అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ ఎదుట నిరసన తెలిపినా.. స్పీకర్‌ కాదు కదా కనీసం సెక్రటరీ కూడా రాకుండా అవమానించారని, తమ పట్ల ఘోరంగా ప్రవర్తించారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు చంద్రబాబు గట్టిగట్టిగా అరుస్తున్నారని - గట్టిగా అరిచినంతమాత్రాన గడ్డిపరక గర్జించలేదని తెలిపారు. మగధీర సినిమా డైలాగ్‌ ల తరహాలో 150మంది రండీ ఒకేసారి సమాధానం చెప్తానని చంద్రబాబు బీరాలు పలుకుతున్నారని - వయస్సు మీద పడుతున్న కొద్దీ ఆయనకు చాదాస్తం పెరిగిపోతుంది అని అన్నారు.