Begin typing your search above and press return to search.

చినబాబుపై మరీ అంత ఎటకారమా రోజా?

By:  Tupaki Desk   |   7 Nov 2016 4:50 AM GMT
చినబాబుపై మరీ అంత ఎటకారమా రోజా?
X
ఏపీ విపక్షంలో ఫైర్ బ్రాండ్లకు కొదవ లేదు. ఎటకారంగా మాట్లాడేవారు కొందరైతే.. తమ తీవ్ర వ్యాఖ్యలతో మంట పుట్టేలా మాట్లాడటం మరికొందరు. అలాంటి వారిలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ముందుంటారు. పదునైన వ్యాఖ్యలు.. విన్నంతనే ఒళ్లు మండేలా మాట్లాడటంలో ఆమెకు ఆమే సాటి. తాజాగా జై ఆంధప్రదేశ్ పేరిట విశాఖ నగరంలో విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభలో రోజా మాట్లాడారు.

ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు.. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి.. బాబు తనయుడు నారా లోకేశ్ పై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ పై చాలా తక్కువగా మాట్లాడినప్పటికీ.. మాట్లాడిన నాలుగు మాటలతో తెలుగు తమ్ముళ్ల ఒళ్లు మండేలా మాట్లాడటం ఆమెకు మాత్రమే సాధ్యమని చెప్పక తప్పదు. ఏపీలో ప్రతిపక్షం లేదని వ్యాఖ్యానించిన లోకేశ్ పై తన మాటల పంచ్ ను ప్రదర్శించారు.

నారా లోకేవ్ కామెడీ ఆర్టిస్ట్ కు ఎక్కువ.. కామెడీ విలన్ కు తక్కువని ఎద్దేవా చేసిన రోజా.. ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ ప్రకటించారని.. మరి.. టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తారా? అని రోజా సవాలు విసిరారు. కనీసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలతో అయినా రాజీనామా చేయించి గెలిపించుకునే ధైర్యం ఉందా? అని నిలదీశారు. వెన్నుపోటు బ్రదర్స్ గా మారిన వెంకయ్య.. చంద్రబాబులకు బుద్ధి చెప్పాలన్న రోజా.. ప్రజా వ్యతిరేక విధానాలతో వెళుతున్న చంద్రబాబును ప్రజలు చొక్కా పట్టుకొని నిలదీసే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/