Begin typing your search above and press return to search.

రోజా మాటల్లో వైకాపా భయం తెలుస్తోంది!!

By:  Tupaki Desk   |   21 Jan 2015 3:30 AM GMT
రోజా మాటల్లో వైకాపా భయం తెలుస్తోంది!!
X
''మేం పోటీచేయడం లేదు... కాంగ్రెస్‌ పార్టీ పోటీచేస్తే వారికి డిపాజిట్‌ కూడా దక్కదు'' అని ఒక పార్టీ కి చెందిన వారు ప్రకటిస్తే.. దానికి ఎలాంటి అర్థం వస్తుంది! తమకు కూడా డిపాజిట్‌ రాదు గనుకనే... వారు పోటీ చేయడం లేదని అనిపిస్తుంది.

అవును మరి.. ఆ మాటలు వింటే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. అందుకే.. తిరుపతి ఉప ఎన్నికల బరినుంచి హుందాగా తప్పుకుంటున్నట్లుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇదివరకే ప్రకటించినప్పటికీ.. పోటీచేయడం వలన ప్రయోజనం ఏమీ ఉండదనే భయంతోనే వారు ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మహిళా నాయకురాలు రోజా.. మంగళవారం నాడు ఎన్నికల సంఘం అధికార్ల వద్ద.. తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా నాయకుల మీద ఫిర్యాదులను దఖలు చేసుకున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కోడ్‌ అమల్లో ఉండగా... దాన్ని ధిక్కరించి.. ఎంపీ శివప్రసాద్‌ తదితరులు చంద్రన్న కానుకలను సంక్రాంతి ముగిసిన తర్వాత కూడా పంచిపెడుతున్నారనేది ఆమె ఆరోపణ. వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్న వైకాపా రోజా.. తాము అక్కడ పోటీచేయలేదని కూడా సెలవిస్తున్నారు. మరణించిన ఎమ్మెల్యే వెంకటరమణ కుటుంబంనుంచి ఎవరు పోటీచేసినా.. తాము పోటీకి దిగబోమని చెప్పారు. వెంకటరమణ భార్యపేరును చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వైకాపా పోటీ ఉండదని తేలిపోతున్నది. కాకపోతే.. కాంగ్రెస్‌ పోటీకి సిద్ధమవుతుండగా.. వారికి అక్కడ డిపాజిట్‌ కూడా రాదని రోజా శకునాలు పలుకుతోంది. ఆమె మాటలను గమనిస్తే... సానుభూతి ప్రభావం వలన.. ఇతర పార్టీలు ఎవ్వరికీ డిపాజిట్‌ రాకపోవచ్చునని.. ఆ భయంతోనే వైకాపా పోటీ మానుకుని.. ఏదో సాంప్రదాయం పాటిస్తున్నట్లుగా బిల్డప్‌ ఇస్తున్నదని పలువురు భావిస్తున్నారు.