Begin typing your search above and press return to search.

రోజా తెలివిగా పావులు కదుపుతోందా ?

By:  Tupaki Desk   |   18 Feb 2022 4:20 AM GMT
రోజా తెలివిగా పావులు కదుపుతోందా ?
X
నగరిని కొత్తగా ఏర్పాటైన శ్రీ బాలాజీ జిల్లాలో కలపాలని నగరి ఎంఎల్ఏ రోజా వినతిపత్రం అందించారు. విజయవాడలో జగన్మోహన్ రెడ్డిని కలిసిన రోజా తన నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో నుండి తప్పించి బాలాజీ జిల్లాలో కలపాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధుల తీర్మానాలను కూడా రోజా అందించారు. నిజానికి మొన్నటి వరకు తిరుపతి పార్లమెంట్ పరిధిలోనే నగరి ఉండేది. కానీ జిల్లాల పునర్విభజనలో భాగంగా చిత్తూరు జిల్లాలో చేర్చారు.

నిజానికి ఈ నియోజకవర్గం ఏ జిల్లాలో ఉన్నా వచ్చే ఇబ్బందేమీ లేదు. ఎందుకంటే జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, వచ్చే నిధులు వస్తునే ఉంటాయి. ఇక సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రమంతా అమలయ్యేవి కాబట్టి నగరికి ప్రత్యేకంగా ఏమీ ఉండదు. అయితే రోజా మాత్రం బాలాజీ జిల్లాలో తన నియోజకవర్గాన్ని కలపాలని ఎందుకింతగా పట్టుబడుతున్నారు ? ఎందుకంటే మంత్రి పదవి కోసమే. పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మంత్రి పదవి కోసం రోజా తెగ ప్రయత్నిస్తున్నారు.

అయితే చిత్తూరు జిల్లా నుండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు కాబట్టి రోజాకు మంత్రి పదవి వచ్చే అవకాశం దాదాపు లేదు. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం లో పెద్దిరెడ్డికే జగన్ అత్యంత ప్రాధాన్యతనిస్తారు. అందుకనే రోజా ఎంతగా ప్రయత్నించినా మంత్రి పదవి రావడం లేదు. పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంతో పాటు నగరి కూడా చిత్తూరు జిల్లాలోనే ఉంది. దీంతో మళ్ళీ రోజాకు పెద్దిరెడ్డి రూపంలో మంత్రి పదవికి అడ్డంకి మొదలైంది.

అదే నగరిని బాలాజీ జిల్లాలోకి మారిస్తే మంత్రిపదవికి రోజాకు దాదాపు అడ్డంకులు తొలగిపోయినట్లే. ఎందుకంటే బాలాజీ జిల్లా నుండి మంత్రి పదవి రావటానికి రోజాకు అవకాశం ఉంటుంది. అందుకనే నగరిని బాలాజీ జిల్లాలో కలపాలని రోజా ఇంతగా పట్టుబడుతున్నారు.

మరి రోజా ప్రయత్నాలకు జగన్ ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తారో చూడాల్సిందే. రోజాతో పాటు మరికొంతమంది కూడా తమ జిల్లాల మార్పు విషయంలో డిమాండ్లు పెరుగుతున్నాయి. కాబట్టి తన డిమాండ్ విషయంలో రోజా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.