Begin typing your search above and press return to search.

రోజా యవ్వారం రచ్చ రచ్చ

By:  Tupaki Desk   |   18 March 2016 4:08 AM GMT
రోజా యవ్వారం రచ్చ రచ్చ
X
ఏపీ అసెంబ్లీ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజు ఏపీ అసెంబ్లీలోకి వచ్చే ప్రయత్నం దీనికి కారణంగా చెప్పొచ్చు. తనపై ఏపీ అసెంబ్లీ విధించిన సస్పెన్షన్ పై గురువారం హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో.. ఏపీ అసెంబ్లీకి హాజరు కావాలని రోజా భావిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ఆమె ఏపీ అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. ఆమెను అసెంబ్లీలోని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయం వరకూ అనుమతిస్తామని.. అసెంబ్లీకి వెళ్లేందుకు అనుమతి లేదంటూ చీఫ్ మార్షల్ స్పష్టం చేయటం వివాదంగా మారింది.

ఈ సందర్భంగా చీఫ్ మార్షల్ తో రోజా వాగ్వాదానికి దిగారు. ఇదిలా జరుగుతుండగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ అక్కడకు చేరుకున్నారు. తన ఎమ్మెల్యేల్ని తాను అసెంబ్లీకి తీసుకెళతానని ఆయన పట్టుబట్టారు. దీంతో.. ఈ వ్యవహారంపై ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. రోజాను అసెంబ్లీలోకి అనుమతించలేమని భద్రతా సిబ్బంది చెబుతుంటే.. అందుకు సంబంధించిన అధికార ఉత్తర్వులు చూపించాల్సిందిగా జగన్ అండ్ కో డిమాండ్ చేస్తున్నారు. దీంతో.. భద్రతా సిబ్బంది కిందామీదా పడుతున్న పరిస్థితి.

తనపై విధించిన సస్పెన్షన్ పై హైకోర్టు స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో తనకు సభకు వెళ్లే హక్కు ఉంటుందని.. కోర్టు పత్రాల్ని రోజా చూపిస్తున్నారు. మరోవైపు.. రోజాను సభకు అనుమతించొద్దని స్పీకర్ కార్యాలయం నుంచి చీఫ్ మార్షల్ కు విస్పష్ట ఆదేశాలు రావటంతో ఆమె అనుమతి విషయంలో ఉత్కంఠ సాగుతోంది.