Begin typing your search above and press return to search.

రోజా రాజీకి వస్తున్నారా?

By:  Tupaki Desk   |   4 April 2016 9:50 AM GMT
రోజా రాజీకి వస్తున్నారా?
X
వైసీపీ ఎమ్మెల్యే రోజా బెట్టు వీడుతున్నారా... టీడీపీతో రాజీకి వచ్చి సారీ చెప్పి సర్దుకుపోతారా అంటే అవుననే వినిపిస్తోంది. ఏపీ సీఎం చంద్ర‌బాబు - టీడీపీ ఎమ్మెల్యే అనిత‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా రోజాను అసెంబ్లీ నుంచి ఏడాది సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దానిపై ఆమె కోర్టుకు వెళ్లడం... తొలుత అనుకూలంగా తీర్పు వచ్చినా, దానిపై మళ్లీ ప్రభుత్వం కేసు వేయగా ప్రతికూలంగా తీర్పు వచ్చింది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆ తీర్పును రోజా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈలోగా రోజాను సభాహక్కుల సంఘం ముందు హాజరుకావాలంటూ మరోసారి సమాచారం పంపించారు. ఈ అవకాశాన్ని ఆమె ఉపయోగించుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంతకుముందు రెండుసార్లు స‌భా హ‌క్కుల సంఘం నోటీసులు జారీచేసినా ఆమె క‌మిటీ ముందు హాజ‌ర‌వ్వ‌లేదు! దీన్ని తీవ్రంగా పరిగణించిన కమిటీ ఆమెపై కఠిన చర్య తీసుకోవాలని భావించింది. కానీ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు నేపథ్యంలో కమిటీ కాస్త వెనక్కు తగ్గింది. రోజాకు మరో ఛాన్స్ ఇవ్వాలని శాసనసభ కూడా నిర్ణయించింది. ఈ నెల 6న తమ ముందు హాజరు కావాలని రోజాకు సభా హక్కుల కమిటీ తాజాగా నోటీసు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో ఇక వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆమె భావిస్తున్నార‌ట‌.

రోజా ఓ టీవీ ఛానల్ తో మాట్లాడిన వివరాలు చూస్తే ఆమె కూడా ఒక మెట్టు దిగుతున్నట్లు అనిపిస్తుంది. దుర్భాషలాడినందుకు క్షమాపణ చెప్పేందుకు అభ్యంతరం లేద‌ని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అనితను ఉద్దేశించి రోజా అసెంబ్లీలో కామెంట్ చేసినందుకు సారీ చెబుతానని రోజా అన్నారు. అయితే రోజా మ‌రో మెలిక పెట్టారు. తనను అన్నమాటలకు కూడా సారీ చెప్పించాలన్నారు. అప్పుడే సారీ చెబుతాన‌ని చెప్పారు. అసెంబ్లీలో వైకాపా బలం రోజురోజుకూ తగ్గుతున్న సమయంలో రోజాలాంటి ఫైర్ బ్రాండ్ అసెంబ్లీకి ఎక్కువ కాలం దూరంగా ఉండటం అంత మంచిది కాదని వైకాపా నేత‌లు పెద్దలు కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ కారణంగానే మిగతా వైసీపీ ఎమ్మెల్యేల మాదిరిగానే సారీ చెప్పి మళ్లీ అసెంబ్లీకి రావాలని... ప్రతిసారి సస్పెండ్ చేసుకుంటూ పోలేరు కాబట్టి మళ్లీ ప్రతాపం చూపించొచ్చని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.