Begin typing your search above and press return to search.

బాబు...ఎర్ర‌చంద్రం అని పిలుస్తారు జాగ్ర‌త్త‌

By:  Tupaki Desk   |   4 July 2017 12:24 PM GMT
బాబు...ఎర్ర‌చంద్రం అని పిలుస్తారు జాగ్ర‌త్త‌
X
ఏపీలోని టీడీపీ ప్రభుత్వం తాగుబోతులకు మ‌ద్ద‌తు ఇచ్చేలా ఉంది త‌ప్ప ప్ర‌జ‌ల‌కోసం ప‌నిచేసేలా లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. రాష్ట్రంలో తినడానికి తిండిలేక - తాగడానికి నీళ్లు లేక - చేసేందుకు పనిలేక ప్రజలు అల్లాడుతుంటే...బాబు మాత్రం తాగినోళ్లకు తాగినంత బీరు బారు అంటూ గడపగడపకు మద్యాన్ని తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జవహర్ బీరును హెల్త్ డ్రింక్ గా ప్రకటించడంపై రోజా మండిపడ్డారు. ఇవి తాగే క్యాబినెట్ లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా..? అంటూ ధ్వజమెత్తారు. ప్రజల ఆరోగ్యాన్ని, వారి ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసేలా క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర కేబినెట్‌ మీటింగ్‌ లో డ్వాక్రా రుణమాఫీపై కాకుండా బార్లు - బీర్లపై చర్చించారని యద్దేవా చేశారు. ప్రభుత్వం కేబినెట్‌ మీటింగ్‌ చేస్తున్నట్లుగా లేదు…వైన్‌ షాప్‌ ఓనర్స్‌ అంతా మీటింగ్‌ పెట్టుకున్నట్లుగా ఉందని రోజా విమర్శించారు.

జూలై 1న బార్ల పాలసీ అమలయినవెంటనే మహిళలు దీనికి వ్యతిరేకంగా పోరాడాక కూడ క్యాబినెట్ లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణమని రోజా అన్నారు. బాబుకు మహిళల ఉసురు తగులుతుందని రోజా నిప్పులు చెరిగారు. ప్లీనరీలో తమ అధినేత మద్యం మీద ఓ ప్రకటన చేస్తారని, పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టి బార్ పాలసీకి వ్యతిరేకంగా పోరాడతామన్నారు. హైద‌రాబాద్‌ లోని వైసీపీ కార్యాల‌యంలో ఏర్పాటుచేసిన విలేక‌రుల స‌మావేశంలో రోజా మాట్లాడుతూ హైవేలను స్టేట్‌ రోడ్స్‌గా డినోటీఫై చేయడం దారుణమని మండిప‌డ్డారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయన్న ఉద్దేశ్యంతో రహదారుల పక్కన బార్ షాపులకు సుప్రీంకోర్టు నో చెప్పిందని, కానీ ప్రభుత్వానికి అవేమీ పట్టడం లేదని రోజా ఆరోపించారు. రాష్ట్రంలో 4, 353 మద్యం షాపులుంటే, దాట్లో 3500 షాపులు రహదారుల పక్కనే ఉన్నాయని..... 885 బార్ లలో 550 బార్లు రహదారుల పక్కనే ఉన్నాయన్నారు. బాబు నీ సొంత జిల్లా ఏర్పేడులో ఓ డ్రైవర్ తాగి 14మందిపై బండి ఎక్కించి ఎలా చంపాడో మరిచారా ..? ఇలాంటి దిగజారుడు నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారని నిలదీశారు.

ఉద్యోగాలు, భృతి ఇవ్వండని నిరుద్యోగులు అడుగుతుంటే ఇవ్వరు... రైతులకు సకాలంలో లోన్లు ఇవ్వమంటే ఇవ్వరు.... డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేయమంటే చేసేందుకు చేతకాదు కానీ, మద్యం మాత్రం ఏరులై పారిస్తున్నారని రోజా దుయ్యబట్టారు. మంత్రి జవహర్ బీరును హెల్త్ డ్రింక్ గా ప్రకటిస్తూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని రోజా ధ్వజమెత్తారు. వీళ్ల పరిస్థితి చూస్తే.... అంగన్ వాడీల్లో కూడ పౌష్టికాహారం పేరుతో చిన్నపిల్లలు - గర్భిణీలు - యువతకు బీర్లు తాగించేలా ఉన్నారని తూర్పారబట్టారు. స్కూళ్లు - కాలేజీల్లో కూడ పిల్లలను చెడిపేసేందుకు ఏమాత్రం వెనుకాడరని విమర్శించారు.జనావాసాలు - స్కూళ్లు - గుళ్ల దగ్గర బార్ల షాపులు పెట్టాలనుకుంటే వైయస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అవన్నీ పగలగొట్టే కార్యక్రమం చేస్తామన్నారు. అవసరమైతే రాష్ట్ర మహిళల కోసం జైలుకు వెళ్లేందుకు కూడ తాము సిద్ధమన్నారు.

హెరిటేజ్ వ్యాన్ లో ఎర్రచందనం దుంగలను తరలించడం చూశాక హెరిటేజ్ ఆస్తులు ఎలా పెరిగిపోతున్నాయో అర్థ‌మ‌వుతోంద‌ని రోజా వ్యాఖ్యానించారు. బాబు కుటుంబ స‌భ్యులు ఎంత కష్టపడుతున్నారో అర్థమైందని ఎద్దేవా చేశారు. గతంలోనూ బాబు పొలంలో ఎర్రచందనం దుంగలు వస్తే అవి ఎలా వచ్చాయో తెలవదంటూ వ్యాఖ్యానించార‌ని రోజా గుర్తు చేశారు. హెరిటేజ్ లోని ఏర్రచందనం దుంగలమీద బాబు మాట్లాడకపోతే ఇకనుంచి ఆయన్ను ఎర్రచంద్రం అని పిలవడం ఖాయమని ఎద్దేవా చేశారు. త‌క్ష‌ణ‌మే ఎర్ర‌చంద‌నం అక్ర‌మాలు, హెరిటేజ్ వాహ‌నంలో త‌ర‌లింపుపై సీఎం చంద్ర‌బాబు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.