Begin typing your search above and press return to search.

తుందుర్రు ఆక్వా ఫ్యాక్ట‌రీపై రోజా మాట విన్నారా?

By:  Tupaki Desk   |   8 April 2017 1:30 PM GMT
తుందుర్రు ఆక్వా ఫ్యాక్ట‌రీపై రోజా మాట విన్నారా?
X
ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా తుందుర్రులో ఏర్పాటు కానున్న మెగా ఆక్వా ఫుడ్ ఫార్క్‌పై ఆందోళ‌న‌లు ఇప్పుడ‌ప్పుడే చ‌ల్ల‌బ‌డేలా క‌నిపించ‌డం లేదు. స‌ముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన ఈ త‌ర‌హా ఫ్యాక్టరీల‌ను గ్రామ సీమ‌ల్లో ఏర్పాటు చేసేందుకే గట్టి నిర్ణ‌యం తీసుకున్న స‌ద‌రు ఫ్యాక్ట‌రీ యాజ‌మాన్యం... జ‌నం ఎంత‌మేర ఆందోళ‌న‌లు వెలిబుచ్చుతున్నా ఏమాత్రం వెనక్కు త‌గ్గే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలో ఈ ఫ్యాక్టరీ కార‌ణంగా ఎంత‌మేర న‌ష్టం వాటిల్లుతుంద‌న్న విష‌యంపై ప్ర‌భుత్వాన్ని నిల‌దీసేందుకు ముందుగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌ద‌ల‌గా... ఆ త‌ర్వాత గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీకి విజ‌యం ద‌క్క‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా రంగంలోకి దిగేసిన విష‌యం మ‌న‌కు తెలిసిందే.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంట్రీతో కాస్తంత వేగంగా స్పందిస్తున్న‌ట్లు కదిలిన ప్ర‌భుత్వం... గ్రామాల్లో ఫ్యాక్టరీ వెల‌సినా... కాలుష్య కార‌కాలు గ్రామాల్లోకి రాకుండా యాజ‌మాన్యం ప‌కడ్బందీ ఏర్పాట్లు చేస్తోందంటూ చెబుతూ... ఫ్యాక్ట‌రీ నిర్మాణానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఈ క్ర‌మంలో అక్క‌డ ఫ్యాక్ట‌రీ నిర్మాణం శ‌ర‌వేగంగా జ‌రుగుతూ ఉంటే... ఆ ప్రాంతానికి చెందిన వైసీపీ కీల‌క నేత ముదునూరి ప్ర‌సాద‌రాజు నిర‌స‌న బాట ప‌ట్టారు. నిన్న ఉద‌యం ఆయ‌న చేపట్టిన నిర‌స‌న దీక్ష‌కు నేటి మ‌ద్యాహ్నం వైసీపీ ఫైర్ బ్రాండ్‌, ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మ‌ద్ద‌తు ప‌లికారు. నేటి ఉద‌యం విశాఖ నుంచి బ‌య‌లుదేరిన రోజా... తుందుర్రులో కొన‌సాగుతున్న ప్ర‌సాద‌రాజు దీక్ష‌కు చేరుకుని దీక్ష‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన రోజా... ఈ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు వెనుక ఉన్న అస‌లు కార‌ణాల‌ను బ‌య‌ట‌పెట్టారు.

మెగా ఆక్వా ఫుడ్ ఫ్యాక్ట‌రీ యాజ‌మాన్యం నుంచి పెద్ద ఎత్తున ముడుపులు అందుకున్న టీడీపీ ప్ర‌భుత్వ పెద్ద‌లు... ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్నా కూడా ప‌ట్టించుకోకుండా అనుమ‌తులు జారీ చేసింద‌ని ఆరోపించారు. ప్ర‌జా సంక్షేమ‌మే ప‌ర‌మావ‌ధిగా ముందుకు సాగుతున్నామ‌ని చెబుతున్న ప్ర‌భుత్వం... తుందుర్రులో అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తూ... ప్ర‌జా గ‌ళాన్ని అణ‌చివేసేందుకు య‌త్నిస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు, వాన‌పాముల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చేందుకు స‌మ‌యం కేటాయిస్తున్న సీఎం చంద్ర‌బాబు... తుందుర్రు బాధితుల క‌ష్టాల‌ను వినేందుకు మాత్రం స‌మ‌యం కేటాయిండక‌పోవ‌డం విడ్డూరంగా ఉంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/