Begin typing your search above and press return to search.

త్వరలో రోజాకు మంత్రి పదవి.. కారణమిదే?

By:  Tupaki Desk   |   4 Feb 2020 4:12 AM GMT
త్వరలో రోజాకు మంత్రి పదవి.. కారణమిదే?
X
పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెన్నంటి ఉన్న నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజాకు కీలక పదవి దక్కనుందా? మండలి రద్దు కొలిక్కి వస్తే ఆమెను మంత్రి పదవి వరించనుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వస్తే రోజాకు జగన్ కేబినెట్లో చోటు ఖాయమని 2019 ఎన్నికలకు ముందు, గెలిచిన తర్వాత అందరూ భావించారు. కానీ సామాజిక, రాజకీయ లెక్కల కారణంగా ఆమెను కేబినెట్లో కి తీసుకోలేదు. ఇప్పుడు మండలి రద్దయితే ఆమెకు లక్ కలిసి రానుందట.

కేబినెట్ మంత్రులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణలు ఉన్నారు. మండలి రద్దుకు వైసీపీ ప్రభుత్వమే తీర్మానం చేసింది. ఈ నేపథ్యం లో వారిద్దరితో రాజీనామా చేయించే అంశాన్ని జగన్ పరిశీలిస్తున్నారట. మండలి రద్దుకు ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి మంత్రులుగా కొనసాగడం సరికాదని భావిస్తున్నారని తెలుస్తోంది.

త్వరలో వీరిద్దరు రాజీనామా చేసే అవకాశాలు కొట్టి పారేయలేమంటున్నారు. అదే కనుక జరిగితే కేబినెట్లో రెండు ఖాళీలు ఏర్పడుతాయి. అప్పుడు రోజాకు తప్పకుండా అవకాశం వస్తుందని భావిస్తున్నారు. తొలిసారి కేబినెట్లోనే ఆమెకి చోటు దక్కుతుందని భావించినా కుదరలేదు. అసంతృప్తి కి గురైన ఆమెకు ఏపీఐఐసీ పదవిని కట్టబెట్టారు. తదుపరి విస్తరణలో చోటు కల్పిస్తామని కూడా చెప్పారని అంటారు. ఇప్పుడు మోపిదేవి, సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేస్తే రెండింట.. ఒకటి రోజాకు ఖాయంగా చెబుతున్నారు.

అసెంబ్లీ లో మండలి రద్దు తీర్మానం పై జరిగిన చర్చ సందర్భంగా ఇద్దరు మంత్రులు కూడా తమకు పదవులు ముఖ్యం కాదని, ప్రభుత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలైన వీరిద్దరిచే రాజీనామా చేయించాలా.. చేయిస్తే తలెత్తే పరిణామాలు ఏమిటనే అంశాలపై వైసీపీ చర్చిస్తోంది. తుది నిర్ణయం జగన్ చేతిలో ఉంది.