Begin typing your search above and press return to search.

రోజాకు మ‌రో నోటీసు రెడీ అయిపోయిందిగా!

By:  Tupaki Desk   |   17 July 2017 12:06 PM GMT
రోజాకు మ‌రో నోటీసు రెడీ అయిపోయిందిగా!
X
వైసీపీ ఫైర్ బ్రాండ్‌, చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మ‌రో నోటీసు ఇచ్చేందుకు ఏపీ అసెంబ్లీ సిద్ధ‌మైపోయింది. గ‌తంలో శాస‌న‌స‌భ‌లో స్పీక‌ర్‌, స‌భా నాయ‌కుడిగా ఉన్న సీఎం నారా చంద్ర‌బాబునాయుడిపై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌న్న కార‌ణాన్ని చూపి రోజాపై ఏడాది పాటు స‌స్పెన్ష‌న్ వేటు ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల‌తో ఆ వివాదం ఇప్పుడిప్పుడే స‌మ‌సిపోతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో రోజాకు మ‌రో నోటీసు ఇచ్చేందుకు అసెంబ్లీ అధికార యంత్రాంగం సిద్ధ‌మైపోయింది. అయినా రోజాకు ఈ తాజా నోటీసులు జారీ కాబోతుండ‌టానికి గ‌ల కార‌ణాల‌ను విశ్లేషిస్తే... ఆశ్య‌ర్యం వేయ‌క మాన‌దు. గ‌తంలో స‌భ‌లో అస‌భ్య ప‌ద‌జాలం వినియోగించార‌న్న కార‌ణం చూపిన చంద్ర‌బాబు స‌ర్కారు ఆమెపై స‌స్పెన్ష‌న్ వేటు వేసింద‌న్న వాద‌న వినిపించింది.

అయితే ఈ ద‌ఫా ఆమెకు నోటీసులు ఇవ్వ‌డానికి గ‌ల కార‌ణాల విష‌యానికి వ‌స్తే... భారత రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు సంబంధించిన నేటి ఉద‌యం దేశవ్యాప్తంగా పోలింగ్ జ‌రిగింది. ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు - ఎంపీలు ఓటు వేసేందుకు అమ‌రావ‌తిలోని తాత్కాలిక స‌చివాల‌యంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేల‌తో భేటీ అయిన సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఓటు హ‌క్కు ఎలా వినియోగించుకోవాల‌న్న విష‌యంపై అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ స‌మావేశానికి స్పీక‌ర్ స్థానంలో ఉన్న కోడెల శివ‌ప్ర‌సాద్ కూడా హాజ‌ర‌య్యారు. స‌మావేశం త‌ర్వాత టీడీపీ ఎమ్మెల్యేల‌తోనే క‌లిసి ఆయ‌న పోలింగ్ బూత్‌ కు వెళ్లారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన రోజా... అక్క‌డే మీడియా ముందుకు వ‌చ్చి స్పీక‌ర్ వ్య‌వ‌హార స‌ర‌ళిని ప్ర‌శ్నించారు.

స్పీక‌ర్ స్థానంలో కూర్చున్న వ్య‌క్తి పార్టీల‌కు అతీతంగా ఉండాల్సి ఉంద‌ని ఆమె వ్యాఖ్యానించారు. గ‌తంలో స్పీక‌ర్లుగా ప‌నిచేసిన న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి గానీ, కేఆర్ సురేశ్ రెడ్డి గానీ ఏనాడూ కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశాల‌కు హాజ‌రు కాలేద‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. అంతేకాకుండా స్పీక‌ర్ స్థానానికి గౌర‌వం ఇచ్చిన వారు కాంగ్రెస్ పార్టీ కండువాలు కూడా ధ‌రించ‌లేద‌ని చెప్పుకొచ్చారు. అయితే అందుకు విరుద్ధంగా ఇప్పుడు ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయ‌ని ఆమె ఆరోపించారు. స్పీక‌ర్ స్థానంలో ఉన్న కోడెల శివ‌ప్ర‌సాద్... టీడీపీ ఎమ్మెల్యేల‌కు అవ‌గాహ‌న కోసం నిర్వ‌హించే స‌మావేశానికి ఎలా వెళ‌తార‌ని ప్ర‌శ్నించారు.

అంతేకాకుండా స్పీక‌ర్‌ గా ఉన్న‌ప్ప‌టికీ... కోడెల త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం స‌త్తెన‌ప‌ల్లిలో ప‌లు అభివృద్ధి కార్యక్ర‌మాల్లో పాల్గొంటున్నార‌ని, ఆ కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న టీడీపీ ఎమ్మెల్యేగానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. పార్టీల‌క‌తీతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన స్పీక‌ర్ స్థానంలో ఉన్న కోడెల‌...అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఇది స‌రైన‌దో, కాదో తేల్చుకునే విష‌యాన్ని కోడెల విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నాన‌ని కూడా ఆమె అన్నారు. ఓ వైపు రోజా మీడియాతో మాట్లాడుతుండ‌గానే... ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌ను అసెంబ్లీ సెక్ర‌టేరియ‌ట్ సిబ్బంది విష‌యాన్ని స్పీక‌ర్ చెవిన వేశారు. దీంతో రోజాకు నోటీసులు జారీ చేయాల‌ని కోడెల అసెంబ్లీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మ‌రి ఈ వ్య‌వ‌హారం ఎంత‌దాకా వెళుతుందో చూడాలి.