Begin typing your search above and press return to search.
నారాయణ సత్తా నెల్లూరులోనే పనిచేయడం లేదు!
By: Tupaki Desk | 17 Jan 2017 6:49 AM GMTఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మంత్రి పి నారాయణపై వైసీపీ నెల్లూరు ఫ్లోర్ లీడర్ రూప్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ సొంత కార్పొరేషన్ కు రెగ్యులర్ కమిషనర్ ను రెండు నెలలుగా నియమించుకోలేకపోయారని ఇది మంత్రి గారి సత్తాకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇంత అసమర్థత మంత్రిని గతంలో ఎవరూ చూడలేదని, పాలన చేతకాకాపోతే వారు తమ పదవుల నుంచి గౌరవంగా తప్పుకోవాలని రూప్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడం వల్ల నెల్లూరు నగరానికి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు వచ్చి ఏడాది దాటినా ఇంతవరకు వాటిని ఖర్చు చేయలేని స్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి జిల్లా మంత్రి నారాయణ సహా మేయర్ అబ్దుల్ అజీజ్ బాధ్యత వహించాలని వైసీపీ ఫ్లోర్ లీడర్ డిమాండ్ చేశారు.
నెల్లూరు పురపాలక సంఘంలో పరిపాలన కుంటుబడిపోయిందని రూప్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. 2015 ఆగష్టు 12వ తేది నెల్లూరు నగరానికి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ. 42.5 కోట్లు మంజూరవగా ఇప్పటికీ వాటిని ఖర్చు చేయలేకపోతున్నారని తెలిపారు. ఇతర పనుల విషయంలోనూ కమీషన్ల కక్కుర్తి - అధికార పార్టీలో వర్గ విభేదాల మూలంగా టెండర్ల ప్రక్రియ ఆలస్యమైతోందని మండిపడ్డారు. నగరంలోని ఓ కీలక పనిని మొత్తం 8 ప్యాకేజీలుగా విభజించగా అందులో 7 ప్యాకేజీల టెండర్లు సక్రమంకాగా ఒక ప్యాకేజీకి సంబంధించి మేయర్ కు అనుకూలురైన ఓ అధికార పార్టీ కార్పొరేటర్ పృద్వీరాజ్ కన్ స్ట్రక్షన్ పేరుతో వేసిన టెండర్ లో బోగస్ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికేట్లు పెట్టారని వైసీపీ ఫ్లోర్ లీడర్ తెలిపారు. ఈ విషయాన్ని తమ పార్టీ నేతలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు ఈ టెండర్ ను రద్దుచేశారన్నారు. తిరిగి ఈ ఏడాది జనవరి 7న దీనికి టెండర్లు పిలవగా ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్లు వేశారన్నారు. ఇలా ఆలస్యం చేసుకుంటూ ఇంతవరకు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులకు మోక్షం కల్పించలేదన్నారు. రెండుమూడు రోజుల్లో టెండర్లకు అనుమతులు ఇవ్వకపోతే దీనిపై వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆందోళనలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/