Begin typing your search above and press return to search.

క‌న్న‌డ‌లో కొత్త ర‌చ్చ‌..అధికార పార్టీలో నిర‌స‌న‌లు

By:  Tupaki Desk   |   7 Jun 2018 10:53 AM GMT
క‌న్న‌డ‌లో కొత్త ర‌చ్చ‌..అధికార పార్టీలో నిర‌స‌న‌లు
X
అనేక ట్విస్టుల‌కు వేదిక‌గా నిలిచి...ఒకింత గ్యాప్ త‌ర్వాత కుదుట‌ప‌డ్డ క‌ర్ణాట‌క రాజ‌కీయాలు మ‌ళ్లీ వేడెక్కుతున్నాయి. ఆర్థికశాఖపై మిత్రుల మధ్య పొడచూపిన విభేదాలు సమసిపోయి ఆ శాఖను జేడీఎస్‌ కు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. ఇతర మంత్రిత్వశాఖల విషయంలో రెండు పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. త‌ద్వారా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి 25 మందితో నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటుచేశారు. 14 మంది కాంగ్రెస్ సభ్యులకు - తొమ్మిదిమంది జేడీఎస్ సభ్యులకు - బీఎస్పీ - కేపీజీపీ నుంచి ఒక్కొక్కరికీ మంత్రివర్గంలో చోటుదక్కింది. మాజీ ప్రధాని దేవెగౌడ పెద్దకుమారుడు రేవణ్ణ - కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ - మహిళా ఎమ్మెల్యే జయమాల(కాంగ్రెస్) ప్రమాణం చేసినవారిలో ఉన్నారు. బుధవారం రాజ్‌ భవన్‌ లో గవర్నర్ వాజుబాయివాలా నూతన మంత్రులతో ప్రమాణం చేయించారు. అయితే మంత్రుల ప్ర‌మాణ‌స్వీకారం అనంత‌ర‌మే కర్ణాటక లో కుంప‌ట్లు రేగాయి.

మంత్రిమండ‌లిలో త‌మ‌కు చోటు ద‌క్క‌లేద‌ని ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. దీంతో మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌ని ఇద్ద‌రు ఎమ్మెల్యేలకు చెందిన మ‌ద్ద‌తుదారులు ఆందోళ‌న నిర్వ‌హించారు. ఎమ్మెల్యే రామ‌లింగా రెడ్డి - ఎమ్మెల్యే రోషన్ బెయిగ్‌ లకు మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించాల‌ని కార్య‌క‌ర్త‌లు డిమాండ్ చేశారు. క‌ర్నాట‌క కాంగ్రెస్ క‌మిటీ ఆఫీసు ముందు రోష‌న్ బెయిగ్‌ కు చెందిన కార్య‌క‌ర్త‌లు ధ‌ర్నా చేశారు. కాగా, ఈ ప‌రిణామంపై కాంగ్రెస్ నేత‌లు స్పందిస్తూ మంత్రి పదవుల కేటాయింపులో తలెత్తిన సమస్యల్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చొరవతో సామరస్యపూర్వకంగా పరిష్కరించనున్నార‌ని అంటున్నారు.

మరోవైపు కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్ కుమారస్వామి నేతృత్వంలో ఐదేళ్ల‌పాటు కొనసాగుతుందని - ఆయనే ముఖ్యమంత్రిగా పూర్తికాలం పదవిలో ఉంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పా రు. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కలిసే ఎన్నికల బరిలోకి దిగుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం మరింత సమర్థంగా పనిచేసేందుకు రెండు పార్టీల ముఖ్య నేతలతో సంకీర్ణ సమన్వయ - పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసినట్లు నేతలు చెప్పారు. మాజీ సీఎం సిద్దరామయ్య కమిటీ చైర్మన్‌ గా - డానిష్ అలీ కన్వీనర్‌ గా వ్యవహరిస్తారని - ఈ కమిటీ ప్రతి నెలకోసారి భేటీ అవుతుందని పేర్కొన్నారు. వివిధ సంస్థలు - కార్పొరేషన్ చైర్మన్‌ లు - నామినేటెడ్ పదవుల నియామకాలను ఈ కమిటీ ఖరారు చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ కు హోం - నీటిపారుదల - రెవెన్యూ - వ్యవసాయం తదితర కీలక శాఖలు దక్కాయి. ఆర్థికం - ఎక్సైజ్ - సమాచారం - ఇంటెలిజెన్స్ - పవర్ - విద్య తదితర శాఖలు జేడీఎస్ ఖాతాలో చేరాయి.