Begin typing your search above and press return to search.

అదిరే ఐడియాతో ఆ న్యూస్ పేపర్ మనసు దోచేసింది

By:  Tupaki Desk   |   22 July 2020 11:30 PM GMT
అదిరే ఐడియాతో ఆ న్యూస్ పేపర్ మనసు దోచేసింది
X
సమయానికి తగ్గట్లు స్పందిస్తే ప్రజల మనసుల్ని దోచుకోవటం పెద్ద విషయం కాదు. తాజాగా అలాంటి పనే చేసిన ఒక న్యూస్ పేపర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రజల మనసుల్ని దోచేసిన ఆ న్యూస్ పేపర్ ఏమిటి? ఇంతకీ అదేం చేసింది? లాంటి వివరాల్లోకి వెళితే..

జమ్ముకశ్మీర్ రాష్ట్ర రాజధాని శ్రీనగర్ కు చెందిన ఒక ఉర్దూ దినపత్రిక సరికొత్త ఐడియాతో ఈ రోజు ముందుకు వచ్చింది. తమ పేపర్ తో పాటు మాస్కును ఉచితంగా పాఠకులకు అందించింది. కరోనా వేళ.. అందరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలన్న సందేశాన్ని తన పత్రికతో చెప్పే ప్రయత్నం చేసింది. రోషిణి అనే పేరుతో పబ్లిష్ అయ్యే ఈ ఉర్దు దినపత్రిక ఈ రోజు చేసిన ప్రయోగం ఏమంటే.. మొదటి పేజీలో సగభాగాన్ని ఖాళీగా ఉంచింది.

అందులో ఒక మాస్కును పెట్టి పిన్ చేశారు. పక్కనే ఉర్దూలో ‘‘మాస్కు ధరించటం చాలా ముఖ్యం’’ అని పేర్కొన్నారు. పాఠకులకు అందించిన మాస్కును ఒక ప్లాస్టిక కవర్ లో పెట్టి పిన్ చేశారు. శ్రీనగర్ నుంచి వెలువడే ఈ దినపత్రిక తన తాజా ఎడిషన్ తో మాస్కు ధరించటం ఎంత ముఖ్యమన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసి పాఠకుల్ని ఆకట్టుకుంది.

తమ ప్రయత్నం గురించి ఆ పత్రిక ఎడిటర్ జహూర్ షోరా మాట్లాడుతూ.. ప్రజల్లో మాస్కుల ప్రాధాన్యతను తెలిపే ప్రయత్నం చేశామన్నారు. మరో ఆసక్తికర విషయం ఏమంటే..తమ పేపర్ తో మాస్కును ఉచితంగా ఇచ్చిన రోషిణి దినపత్రిక ధర ఎంతో తెలుసా? అక్షరాల రెండు రూపాయిలు మాత్రమే. ఈ రోజు పత్రికతో పాటు మాస్కు రావటాన్ని పాఠకులు సైతం ఆశ్చర్యానికి గురైనట్లు చెబుతున్నారు. ఈ దినపత్రిక చేసిన ప్రయోగం సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ సంచలనంగా మారింది. పలువురు ఈ మీడియా సంస్థ ప్రయోగాన్ని అభినందిస్తున్నారు.