Begin typing your search above and press return to search.

మోడీకి గౌరవం.. ఒబామాకు అవమానం!

By:  Tupaki Desk   |   4 Sep 2016 4:25 AM GMT
మోడీకి గౌరవం.. ఒబామాకు అవమానం!
X
సాధారణంగా ప్రపంచంలోని ఏ దేశానికైనా ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు వెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు. అబ్బో.. ఈ వ్యవహారం మామూలుగా ఉండదు. ఈ గౌరవం విషయంలో ఒకదేశాన్ని చూసి మరో దేశం పోటీపడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అన్నీ రెడ్ కార్పెట్ స్వాగతాలే.. వేరే దేశం అయినా కూడా అతడికి నచ్చింది నచ్చినట్లు జరుగుతుంది.. ఆ కాసేపు అతడి వ్యక్తిగత సిబ్బందే ఆ ఆతిధ్య దేశంలో అన్నీ నిర్ణయిస్తారు. అయితే ఈ విషయంలో చైనా మాత్రం అలాంటి పనులు చేయలేదు.. సరికదా వారికి దిమ్మతిరిగే షాకిచ్చింది.

జీ-20 సమ్మిట్‌ లో పాల్గొనేందుకు చైనా వెళ్లిన అమెరికా అధ్యక్షుడు ఒబామాకు.. అక్కడి హాంగ్‌ ఝౌ విమానాశ్రయంలో చైనా ఝులక్ ఇచ్చింది. ఆయన వస్తున్నాడంటే రెడ్ కార్పెట్ సంగతి దేవుడెరుగు.. అసలు ఆయన వచ్చిన విమానానికి స్టెయిర్ కేస్ కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో విమానానికే ఉన్న సాదారణ మెట్లద్వారానే ఒబామా దిగాల్సి వచ్చింది. అంతేనా అనుకోకండి.. ఇంకా చాలానే చేసింది చైనా.

అధ్యక్షుడి విషయంలో అలా చేసిన అనంతరం.. అతనితో వచ్చిన పాత్రికేయుల బృందాన్ని ఆయన సమీపంలో ఉండకుండా చైనా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఒబామా సిబ్బంది "మా నాయకుడి కోసం మీ దేశంలో మేమే కొన్ని రూల్స్ పెడతాం" అని చెప్పారు. దీనిపై స్పందించిన చైనా అధికారి వారికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు. ఒబామా సిబ్బందికి సమాధానం ఇస్తూ ఆ అధికారి... "ఇది మాదేశం.. మా ఎయిర్ పోర్ట్.. కాబట్టి ఇక్కడ రూల్స్ మేమే నిర్ణయిస్తాం" అని గట్టిగా తెగేసి చెప్పాడు. దీంతో బిత్తర ముఖాలు పెట్టిన వైట్ హౌస్ అధికారులు - ఒబామా సిబ్బంది.. చివరికి చైనా అధికారులు చెప్పినట్లే నడుచుకున్నారు. కాగా.. భారత ప్రధాని మోడి చైనా వెళ్లినప్పుడు మాత్రం.. చైనా అధికారులు ఎర్ర తివాచి పరిచి మరీ ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే!