Begin typing your search above and press return to search.

రౌడీషీట‌ర్ ను ఎంత దారుణంగా మ‌ర్డ‌ర్ చేశారంటే

By:  Tupaki Desk   |   30 Oct 2017 4:53 AM GMT
రౌడీషీట‌ర్ ను ఎంత దారుణంగా మ‌ర్డ‌ర్ చేశారంటే
X
గుంటూరులో దారుణ‌మైన హ‌త్య చోటు చేసుకుంది. న‌డిరోడ్డు మీద అంద‌రూ చూస్తుండ‌గా.. రౌడీషీట‌ర్ బ‌స‌వ‌ల వాసును న‌రికి చంపేశారు. కేవ‌లం 60 సెక‌న్ల వ్య‌వ‌ధి (నిమిషం)లో 40 క‌త్తిపోట్లు పొడిచేసిన వారు వ‌చ్చినంత వేగంగా వెళ్లిపోయారు. ఈ హ‌త్యోదంతం గుంటూరు న‌గ‌రంలో తీవ్ర క‌ల‌క‌లాన్ని రేపింది. నిత్యం అత్యంత ర‌ద్దీగా ఉండే అరండ‌ల్‌ పేట 12వ లైన్లో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచ‌ల‌నంగా మారింది.

ఆదివారం రాత్రి 8.30 గంట‌ల స‌మ‌యంలో అరండ‌ల్ పేట 12వ లైన్‌ లోని ఒక రెస్టారెంట్ నుంచి 38 ఏళ్ల బ‌స‌వ‌ల వాసు మ‌రొక‌రితో క‌లిసి బ‌య‌ట‌కు వ‌చ్చి నిల‌బ‌డ్డారు. అంత‌లోనే ఓ స్కార్ఫియో వాహ‌నం వ‌చ్చి ఢీ కొట్టింది. కింద‌కు ప‌డిన వాసు తేరుకునేలోపే వేగంగా వాహ‌నంలో నుంచి దిగిన ఐదుగురు దుండ‌గులు వేట‌కొడ‌వ‌ళ్లు.. క‌త్తుల‌తో విచ‌క్ష‌ణార‌హితంగా న‌రికి చంపారు.

కేవ‌లం 60 సెక‌న్ల వ్య‌వ‌ధిలో 40 క‌త్తిపోట్లు పొడిచారు. అయినా బ‌తికి ఉన్నాడేమోన‌న్న సందేహంతో ఒక దుండ‌గుడు వాసు పీక‌ను కోసేశాడు. కేవ‌లం నిమిషం వ్య‌వ‌ధిలోనే ఈ దారుణ హ‌త్య పూర్తి అయ్యింది. వ‌చ్చినంత వేగంగా తిరిగి వెళ్లిపోయారు. వాసును హ‌త్య చేసిన వెంట‌నే హ‌డావుడిగా వాహ‌నం ఎక్కి వెళ్లిపోయారు. ఈ హ‌త్య‌ను ప్ర‌త్య‌క్షంగా చూసిన వాళ్లు షాక్ నుంచి తేరుకునేలోపే ఘ‌ట‌నాస్థ‌లం నుంచి పారిపోయారు. హ‌త్య చేసిన దుండ‌గుల్లో కొంద‌రు టోపీలు ధ‌రించ‌గా.. మ‌రికొంద‌రు ముఖం క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు.

గుంటూరు న‌గ‌రంలోని విద్యాన‌గ‌ర్‌ కు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యేకు వాసు ముఖ్య అనుచ‌రుడిగా వ్య‌వ‌హ‌రించాడు. 2004లో వాసు సోద‌రుడు వీర‌య్య‌ను హ‌త్య చేశారు. దీంతో ప‌గ‌బ‌ట్టిన వాసు 2005లో త‌న సోద‌రుడ్ని చంపిన వారిని హ‌త్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆ స‌మ‌యంలో వాసుపై రౌడీషీట్ ను న‌మోదు చేశారు. త‌ర్వాతి కాలంలో మాజీ ఎమ్మెల్యే ద‌గ్గ‌ర సెటిల్‌ మెంట్ల వ్య‌వ‌హారంలో ఒక వ్య‌క్తి మృతి చెందాడు. ఈ కేసులో జైలుశిక్ష విధించ‌గా.. ఇటీవ‌ల బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. అత్యంత నాట‌కీయంగా.. నిమిషం వ్య‌వ‌ధిలో చేసిన హ‌త్య‌కు సంబంధించిన సీసీ కెమేరా ఫుటేజ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ హ‌త్య విచార‌ణను గుంటూరు అర్బ‌న్ ఎస్పీ విజ‌య‌రావు స్వ‌యంగా చేప‌ట్టారు. ఘ‌ట‌నాస్థ‌లాన్ని ప‌రిశీలించారు. ఈ హ‌త్య‌కు సంబంధించి కొంద‌రు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. రెస్టారెంట్‌కు వాసుతో వ‌చ్చిన వ్య‌క్తి గురించి ఆరా తీస్తున్నారు. స‌ద‌రు వ్య‌క్తి టీడీపీకి చెందిన న‌గ‌ర నాయ‌కుడిగా గుర్తించారు. అత‌న్ని విచారిస్తున్నారు. రెస్టారెంట్ నుంచి వాసు బ‌య‌ట‌కు వ‌స్తున్న స‌మాచారాన్ని ఎవ‌రు అందించి ఉంటార‌న్న విష‌యంపై ఆరా తీస్తున్నారు. పాత క‌క్ష‌ల నేప‌థ్యంలో వాసును హ‌త్య చేశారా? దీని వెనుక రాజ‌కీయ‌మైన అంశాలు ఉన్నాయా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.