Begin typing your search above and press return to search.

ఆప‌రేష‌న్ వ‌శిష్ట స‌క్సెస్‌..ఎన్ని మృత‌దేహాలు బ‌య‌ట ప‌డ్డాయంటే..

By:  Tupaki Desk   |   22 Oct 2019 12:40 PM GMT
ఆప‌రేష‌న్ వ‌శిష్ట స‌క్సెస్‌..ఎన్ని మృత‌దేహాలు బ‌య‌ట ప‌డ్డాయంటే..
X
గోదావరి నదిలో తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటకు తీశారు. గ‌త నెల 15వ తేదీన సుడిగుండంలో చిక్కుకున్న ఈ బోటు మునిగిపోయిన సంగ‌తి తెలిసిందే. మొత్తం 38 రోజుల పాటు గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట ఇవాళ బయటకు వచ్చింది. రెండో విడ‌త ఆప‌రేష‌న్లో భాగంగా కాకినాడ‌కు చెందిన ప్ర‌ముఖ బోటు నిపుణుడు ధర్మాడి సత్యం బృందం త‌న టీం సాయంతో ఈ బోటు బ‌య‌ట‌కు తీశారు. ఈ ఆప‌రేష‌న్ మొత్తం కాకినాడ పోర్టు అధికారిక ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగింది.

రెండు రోజుల నుంచి డీప్ డ్రైవ‌ర్లు బోటుకు లంగ‌ర్లు వేసి పైకి తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ ప్ర‌య‌త్నంలో లంగ‌ర్ వేయ‌డం కుద‌ర‌క‌పోవ‌డంతో రెండు రోజుల క్రితం బోటు పై భాగం విడిపోయి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇక రెండోసారి బోటు కింద భాగాన లంగ‌రు వేయ‌డంతో ఈ రోజు బ‌య‌ట‌కు వ‌చ్చింది.

మరోవైపు బోటులో మృతదేహాలు బయటపడుతున్నాయి.. బోటు పూర్తిగా ధ్వంసమైపోగా.. బోటులో దాదాపు ఐదు మృతదేహాల వరకు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఐదు మృత‌దేహాలు ఏసీ కేబిన్‌ లో ఉన్నాయి.

మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో.. మృతులు ఎవరనేది గుర్తించడం కష్టంగా మారింది. ఈ ప్రమాదంలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. 39 మంది మృతిచెందిన సంగ‌తి తెలిసిందే. ఇక ఆచూకి దొర‌క‌ని వారిలో ఎక్కువ మంది ఉత్త‌రాంధ్ర‌తో పాటు తెలంగాణ‌కు చెందిన వారే ఉన్నారు. ఇక ధ‌ర్మాడి స‌త్యం బృందం కూడా ఏకంగా 20 రోజుల పాటు క‌ష్ట‌ప‌డి.. అత్యంత ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను ఎదుర్కొని ఎట్ట‌కేల‌కు ఈ రోజు బోటు బ‌య‌ట‌కు తీసింది.

ఇక ప్ర‌మాదంలో గ‌ల్లంతైన వారికి ఇప్ప‌టికే కుటుంబ స‌భ్యుల కోరిక మేర‌కు డెత్ స‌ర్టిఫికెట్లు జారీ చేసిన ప్ర‌భుత్వం వారి కుటుంబాల‌కు రు.10 ల‌క్ష‌లు ఎక్స్‌ గ్రేషియా అందించ‌గా.. మ‌రో రు.10 ల‌క్ష‌లు బీమా సంస్థ ద్వారా అందించారు. ఇక బోటు క్షుణ్ణంగా ప‌రిశీలించాక ఇంకా ఏమైనా అడుగు భాగాల్లో మృత‌దేహాలు దొరుకుతాయేమో ? చూడాలి.