Begin typing your search above and press return to search.

40 సంవత్సరాల తరువాత అక్కడ పెళ్లి బాజా

By:  Tupaki Desk   |   27 Jun 2016 12:43 PM IST
40 సంవత్సరాల తరువాత అక్కడ పెళ్లి బాజా
X
యువరాజు పెళ్లనగానే కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ పెళ్లి అనుకోవద్దు.. ఆయన ‘ముచ్చట’ కాదిది. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో మైసూర్ యువరాజు పెళ్లి ముచ్చటిది. మామూలుగానే కళకళలాడే మైసూరు రాజప్రాసాదం యువరాజు యదువీర్‌ కృష్ణదత్త చామరాజ వివాహంతో మరింత శోభాయమానంగా మారిపోయింది. అంబా విలాస్‌ ప్యాలెస్‌ అందం చూడడానికి రెండు కన్నులూ చాలవన్నట్లుగా ఉంది. రాజస్థాన్‌ రాజవంశానికి చెందిన త్రిషికా కుమారి సింగ్‌ తో మైసూర్‌ యువరాజు వివాహం సోమవారం ఉదయం 9.05 నుంచి 9.30 మధ్య జరిగింది. మైసూరు ప్యాలస్ లో 40 ఏళ్ల తరువాత మళ్లీ పెళ్లి వేడుకలు జరుగుతుండడంతో స్థానికులంతా కోట ప్రాంతాన్ని - వివాహాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

మైసూరు ప్యాలెస్‌ లో ఆదివారం నుంచే పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం 1976లో అప్పటి యువరాజు శ్రీకంఠదత్త నరసింహ రాజ వడయార్‌- ప్రమోదాదేవిల వివాహం తరు వాత మైసూర్‌ రాజవంశంలో పెళ్లిబాజాలు మోగడం ఇదే తొలిసారి. దీంతో యుదువీర్‌ - త్రిషి కల వివాహంపై సర్వత్రా ఆసక్తి కనబరుస్తున్నారు. 22 యేళ్ల త్రిషిక… రాజస్థాన్‌ లోని దుంగర్‌ పూర్‌ కి చెందిన మహారాజ కుమార్‌ హర్షవర్థన్‌ సింగ్‌ - రాజకుమారి మహేశ్వరి కుమారిల రెండో కుమార్తె. యదువీర్‌ కృష్ణదత్త బోస్టన్‌ లోని మసాచూసెట్స్‌ యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్‌ విభాగంలో గాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. యుదువీర్‌.. శ్రీకంఠ దత్త సోదరి - యువరాణి గాయిత్రీ దేవి మనవడు. చివరి మైసూరు మహారాజు మహారాజ జయచామరాజ ఒడయార్‌ మొదటి కుమార్తే గాయిత్రీ దేవి. శ్రీకంఠ దత్త, ప్రమోదాదేవి దంపతులకు పిల్లలు లేరు. దీంతో యుదువీర్‌ సింగ్‌ ను ప్రమోదా దేవి గతేడాది ఫిబ్రవరి 23న దత్తత తీసుకున్నారు. 2015 మే 28న మైసూర్‌ 27వ మహారాజుగా పట్టా భిషేకం చేశారు.

సోమవారం నాటి వివాహ వేడుకకు రాజ కుటుంబీకులు - బంధువులు - పండితులు - వీఐపీలు - ప్రత్యేక అతిథులు సహా కేవలం 550 మంది మాత్రమే హాజరవుతున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ - ప్రధాని నరేంద్ర మోడీ - ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరులకు స్వయంగా ఆహ్వానాలు అందించడంతో వారిలో కొందరు హాజరయ్యే అవకాశాలున్నాయి. మంగళవారం మైసూర్‌ ప్యాలెస్‌ లోని దర్భార్‌ హాల్‌ లో ఘనంగా రిసెప్షన్‌ వేడుకలు జరగనున్నాయి. రిసెప్షన్‌ కు దేశ వ్యాప్తంగా దాదాపు 2 వేల మంది వీఐపీలు హాజరు కానున్నట్టు సమాచారం. వచ్చే నెల 2న బెంగళూరు ప్యాలెస్‌ లో ప్రజల కోసం మరోసారి రిసెప్షన్‌ ను నిర్వహించనున్నట్టు చెబుతున్నారు.