Begin typing your search above and press return to search.

కేకేఆర్​ మళ్లీ ఫెయిల్​.. ఆర్​ఆర్​ గ్రాండ్ విక్టరీ!

By:  Tupaki Desk   |   25 April 2021 4:30 AM GMT
కేకేఆర్​ మళ్లీ ఫెయిల్​.. ఆర్​ఆర్​ గ్రాండ్ విక్టరీ!
X
కోల్​కతా నైట్​ రైడర్స్​ మరోసారి ఓటమి పాలైంది. ఈ ఐపీఎల్​ సీజన్​ లో ఇప్పటి వరకు 5 మ్యాచులు ఆడిన ఆ జట్టు కేవలం ఒక్క మ్యాచ్​ లోనే విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరిపోయింది. పవర్​ ప్లేలో ఓపెనర్లు దారుణంగా విఫలమయ్యారు. వెరసి ఆ జట్టుకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. మిడిల్​ ఆర్డర్ బ్యాట్స్​మెన్లు కొంత మేర రాణించారు. రాహుల్​ త్రిపాఠి ( 36), దినేశ్​ కార్తీక్​ (25) పరుగులు సాధించారు. నిర్ణీత 20 ఓవర్లలో కోల్​కతా నైట్​ రైడర్స్​ కేవలం 133 పరుగులు మాత్రమే చేసింది.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో మామూలుగా అయితే పరుగుల వరద పారుతుంది. బ్యాటింగ్​ కు అనుకూలంగా ఉన్న ఈ పిచ్​ ను కోల్​ కతా టీం వినియోగించుకోలేకపోయింది. చివరల్లో ఆల్​రౌండర్​ ఆండ్రి రస్సెల్​ మెరుపులు మెరిపిస్తాడని.. కనీసం స్కోరు 150 దాటుతుందని కోల్​కతా ఫ్యాన్స్​ భావించారు. కానీ రస్సెల్​ కూడా ఫ్యాన్స్​ ను తీవ్రంగా నిరాశ పరిచాడు. వేగంగా వెనుదిరిగాడు.

ఆ తర్వాత వచ్చిన కమ్మిన్స్​ కూడా పెద్దగా ఆడలేదు. ఓపెనర్లు, మిడిల్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్లు దారుణంగా విఫలం కావడంతో కేకేఆర్​ పెద్ద స్కోరు చేయలేకపోయింది.134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్​ఆర్​ కేవలం 18.5 ఓవర్లలోనే విజయం సాధించింది. రాజస్థాన్ జట్టు ఓపెనర్ బట్లర్ ను 5 పరుగులకే కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అవుట్​ చేశాడు. యశస్వి జైస్వాల్, శివం దూబే రాణించారు. ఇద్దరు చెరో 22 పరుగులు చేసి జట్టును గాడిలో పెట్టారు.

కెప్టెన్ సంజూ సామ్సన్ (42), డేవిడ్ మిల్లర్(24) చివరి వరకు ఔట్ కాకుండా నిలకడగా పరుగులు చేయడంతో రాయల్స్ 18.5 ఓవర్లలోనే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో కేకేఆర్​ జట్టు పాయింట్ల పట్టికలో వెనకపడిపోయింది. ఇప్పుడు ఆ జట్టు చివరి స్థానానికి వచ్చింది. ఇక రాజస్థాన్​ రాయల్స్​ పాయింట్లు పెంచుకొని ఆరో స్థానానికి వెళ్లింది. రాజస్థాన్​ రాయల్స్​ కు కీలక బౌలర్​ ఆర్చర్​ లేకపోయినప్పటికీ ఆ జట్టు రాణించింది. కేకేఆర్​ మాత్రం ఇటు బ్యాటింగ్​, అటు బౌలింగ్ వైఫల్యంతో వరస పరాజయాలను మూటగట్టుకుంటున్నది.